గుంటూరు, ఆంధ్రప్రభ వెబ్ ప్రతినిధి : ఉభయ తెలుగు రాష్ట్రాలలో విద్యుత్ వ్యవస్థ పనితీరు ఆందోళన కలిగిస్తోంది. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన నివేదికను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని
నీతి ఆయోగ్ రూపొందించే విద్యుత్, పర్యావరణ సూచిక (స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమెట్ ఇండెక్స్ – సెకీ) లో వివిధ రాష్ట్రాల పనితీరు బహిర్గతమైంది. ఈ సూచికలో పెద్ద రాష్ట్రాల విభాగానికి సంబంధించి గుజరాత్, కేరళ, పంజాబ్ రాష్ట్రాలు మొదటి మూడు స్థానాలలో నిలవగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు 11,12 స్థానాలకే పరిమితమయ్యాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోల్చి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ 18 ఆ స్థానంలో నిలవటం గమనార్హం.
సెకీ సూచికలో రాష్ట్రాల స్థానాలు నిర్ణయించేందుకు ప్రధానంగా ఆరు అంశాలను కొలమానంగా తీసుకుంటారు. విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరు, విద్యుత్ లభ్యత- సమర్ధత-వాస్తవికత, హరిత ఇంధన విధానాలు, ఇంధన సామర్ధ్యం, పర్యావరణ సుస్థిరత, నూతన విధానాలు అవలంబలంబించటం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్రాలకు ర్యాంకింగ్ లు కేటాయిస్తారు. దేశంలో 20 రాష్ట్రాలను పెద్ద రాష్ట్రాల కేటగిరీగా విభజించి ప్రత్యేకంగా పనితీరు అంచనా వేస్తున్నారు. మిగిలిన రాష్ట్రాలన్నింటిని కలిపి ఓవరాల్ గా ర్యాంకులు కేటాయించే పద్దతికి నీతి ఆయోగ్ శ్రీకారం చుట్టింది. పెద్ద రాష్ట్రాల విభాగంలో గుజరాత్ 50.1 స్కోరుతో పనితీరుతో అగ్రస్థానంలో నిలిచింది. కేరళ 49.1, పంజాబ్ 48.6 స్కోరు తో వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. నీతి ఆయోగ్ పరిగణలోకి తీసుకునే ప్రతి అంశంలోనూ విడివిడిగా స్కోరు కేటాయిస్తారు. విద్యుత్ వినియోగం లో నూతన విధానాల అవలంబించటం, విద్యుత్ వాహనాలు, చార్జింగ్ సౌకర్యం కల్పించటం, వినియోగదారులకు
స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేయటం వంటి విభాగాలలో ఆంధ్రప్రదేశ్ కు సున్న స్కోరు లభించింది. అదేవిధంగా విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరుకు సంబంధించి రుణవిధానం, నేరుగా నగదు బదిలీ ప్రక్రియలలోనూ స్కోరు సాధించలేకపోయింది. అయితే వినియోగదారులకు విద్యుత్ చార్జీల అమలులో ఆంధ్రప్రదేశ్ కు నూరుశాతం స్కోరు లభించటం విశేషం.
విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరు మొత్తాన్ని పరిగణలోకి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ కు 65.1 స్కోరు లభించింది. విద్యుత్ లభ్యత, సమర్ధత, వాస్తవికత విభాగంలో 42.6 , హరిత ఇంధన విభాగంలో 16.9, విద్యుత్ సామర్ధ్య విభాగంలో 40, పర్యావరణ సుస్థిరత విభాగంలో 35 వంతున స్కోరు సాధించింది. పారిశ్రామిక రంగానికి విద్యుత్ సరఫరా విభాగంలో ఆంధ్రప్రదేశ్ ముందున్నట్టు నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేస్తోంది. ఆ విభాగంలో నూటికి నూరుశాతం స్కోరు సాధించింది. అయితే వ్యవసాయ విద్యుత్ సరఫరా విభాగంలో బాగా వెనుకబడింది. ఆ విభాగంలో కేవలం 5.6 మాత్రమే స్కోరు లభించింది. రాష్ట్రంలో
వ్యవసాయ రంగానికి 9 గంటలపాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నట్టు ప్రభుత్వ అధికారులు ప్రకటిస్తున్న నేపధ్యంలో ఆ విభాగంలో అతితక్కువ స్కోరుకే పరిమితం కావటం గమనార్హం. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు విద్యుత్ సరఫరా, క్రాస్ సబ్సిడీ విభాగాలలో కేరళ రాష్ట్రం అద్భుత పనితీరు కనబరుస్తోందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. అదే విధంగా చిన్న రాష్ట్రాల విభాగంలో గోవా, త్రిపుర, మణిపూర్ లు వరుసగా మొదటి మూడు స్థానాలలో నిలిచాయి. కేంద్రపాలిత ప్రాంతాలలో ఛండీఘడ్, డిల్లీ, డయ్యు డామన్, దాద్రానగర్ హవేలీలు అగ్రస్థానంలో వున్నాయి.