ఏపీ సీఎం జగన్ కేబినెట్లో సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుందని ఆశించిన బాలినేనికి ఆశాభంగం ఎదురైంది. తనతో తొలివిడతలో పనిచేసిన వారిలో 11మందికి మళ్లీ చాన్స్ దక్కింది. తనకు కూడా మంత్రి పదవి తప్పకుండా వస్తుందనుకుంటే రాకుండా పోయింది. దీంతో అతని అనుచరులు ప్రకాశం జిల్లాలో వీరంగం సృష్టించారు. బైకులు, టైర్లు కాలబెట్టి, ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిరసన తెలిపారు. అయితే.. బాలినేని కూడా ఈ విషయంలో రాజీనామా చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఆయన అలకబూని ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. దీంతో సీఎం జగన్ స్వయంగా ఆయనను ఇవ్వాల పిలిపించుకుని మాట్లాడారు.
సీఎం జగన్‌తో జరిగిన భేటీ తర్వాత మాజీ మంత్రి బాలినేని మీడియాతో మాట్లాడారు. తనకు మంత్రి రాకపోవడంతో కాస్త బాధపడ్డ విషయం నిజమేనని, కానీ రాజీనామా చేస్తున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. అంతేకాకుండా ప్రకాశం జిల్లాకు చెందిన మరో మంత్రి ఆదిమూలపు సురేశ్‌తో తనకెప్పుడు విభేదాలు లేవని, మీడియాలో తప్పుడు కథనాలు వచ్చాయన్నారు. వైఎస్సార్ కుటుంబానికి తాము ఎప్పటినుంచో సన్నిహితులమని, వారికి విధేయులుగానే ఉంటామని చెప్పుకొచ్చారు బాలినేని. కాగా, సీఎం జగన్ అప్పగించిన బాధ్యతలను ఎవైనా సక్రమంగా నిర్వర్తిస్తానని, ఎలాంటి బాధ్యతలు అప్పగించినా పనిచేస్తానన్నారు బాలినేని. సామర్థ్యం ఉన్నవారినే మంత్రులుగా నియమించారని కితాబిచ్చారు.