ప్రపంచ వ్యాప్తం మన డాక్టర్లకు గుర్తింపు
ఆరోగ్య వంత సమాజం కోసం చేస్తున్నకృషి మరువలేం
భారతీయ మహిళలు అన్ని రంగాలో పురోగమిస్తున్నారు
యువ వైద్యులు అత్యుత్తమ సేవలందించాలి
మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
మంగళగిరి – భారత మహిళలు, యువతులు అన్ని రంగాలలో ఉన్నతి సాధించాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. నేడు జరిగిన మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నలుగురు విద్యార్థులకు బంగారు పతకాలు రాష్ట్రపతి ప్రధానం చేశారు. అలాగే ఎయిమ్స్ తొలి బ్యాచ్ కు చెందిన 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు రాష్ట్రపతి పట్టాలు అందజేశారు.
అనంతరం రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ.. ‘‘పానకాల స్వామికి నా ప్రార్ధన.. లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి.. యువ వైద్యులుగా మీరందరూ అత్యుత్తమ సేవలందించాలి. ఇప్పుడు డాక్టర్లు అయిన వారిలో 2/3 వంతు మహిళా డాక్టర్లు. ఎయిమ్స్ మొదటి బ్యాచ్‌గా మీరందరూ గుర్తుంటారు’’ అని తెలిపారు.
ఆరోగ్యంపై దృష్టి పెట్టండి.
దేశ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని.. పూర్తి ఆరోగ్యంపై అందరూ దృష్టి పెట్టాలని రాష్ట్రపతి సూచించారు. ప్రతీరోజూ ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలన్నారు. యోగాసనాలు, ప్రాణాయామాలు చేయడం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమన్నారు. సమయం, పరిస్ధితులను బట్టి ప్రతీ మనిషి జీవనశైలి ఉండాలని వెల్లడించారు. మెడికల్ టెక్నాలజీ ఎడ్యుకేషన్‌తో అందరికీ ఉపయోగపడే సేవలు అందిస్తారని ఆశిస్తాన్నట్లు చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా దేశ ప్రజలకు ఆరోగ్య సేవలు తేలిగ్గా అందించడమే ధ్యేయమన్నారు.
మన వైద్యుల సేవలు మరవలేనవి …
ప్రపంచపటంలో భారతదేశం మెడికల్ సేవలలో అందుబాటులో ఉండే దేశంగా నిలవటానికి మన డాక్టర్ల సేవలు మరువలేనివని కొనియాడారు. ప్రతీ రోగికీ సేవలందించాలి.. ప్రతీ డాక్టర్ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలి స్పష్టం చేశారు. యువ డాక్టర్లు సేవ చేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నానన్నారు. ఆరోగ్యకరమైన, అభివృద్ధి సాధించే భారతదేశం మనందరికీ కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.
రాష్ట్రపతిని సత్కరించిన చంద్రబాబు..
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు శాలువ కప్పి సన్మానించారు. అలాగే తిరుమల శ్రీవారి మెమొంటోను బహుకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొలనుకొండలో రీసెర్చ్ సెంటర్, ఐఐటీతో అనుసంధానించాలనుకుంటున్నామన్నారు. మెడికల్ అనేది ఇప్పుడు మెడ్ టెక్‌గా మారిపోయిందని, డీప్ టెక్‌ను మెడికల్‌లో కూడా అమలు చేయాలనుకుంటున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నజీర్, కేంద్ర మంత్రులు ఆయూష్ శాఖ మంత్రి ప్రకాష్ రావు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ , సత్య కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.