అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి. ఎగువ, దిగువ ఆలయాల్లో స్వామి వారు వివిధ వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులు స్వామి వైభవాన్ని పులకించి నరసింహ నామస్మరణ చేస్తున్నారు. ముఖ్యంగా అహోబిల పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అహోబిల మఠం 46 పీఠాధిపతి శ్రీ వన్ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి ఆధ్వర్యంలో, జిపిఎ సంపత్, దేవస్థానం ఈవో బివి నర్సయ్యల సమక్షంలో వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సోమవారం ఎగువ అహోబిలంలో రాత్రి శ్రీ జ్వాలా నరసింహస్వామి పొన్నచెట్టు వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. పూజల అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. ఉదయం ఉత్సవ మూర్తులైన శ్రీ జ్వాలా నరసింహస్వామి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు తోపాటు అహోబిల మఠం మొట్టమొదటి పీఠాధిపతి శ్రీ ఆది వన్ శఠగోప యతీంద్ర మహాదేశికన్ ఉత్సవమూర్తిని కూడా ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు అర్చకులు కిడాంబి లక్ష్మీనరసింహాచార్యులు వేద మంత్రోచ్ఛారణల మధ్య తిరుమంజనం (అభిషేకం) నిర్వహించారు. రాత్రి ప్రత్యేకంగా అలంకరించిన శ్రీ జ్వాలా నరసింహస్వామి పొన్నచెట్టు వాహనంపై ఆశీనులను చేసి పూజల అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు.
దిగువ అహోబిలంలో : బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ ప్రహ్లాద వరద స్వామి సోమవారం మోహిని అలంకారంలో ప్రత్యేకంగా దర్శనమిచ్చారు. శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల తోపాటు ప్రహ్లాద వరద స్వామిని పల్లకిలో ఆసీనులను చేసి ఆలయం నుండి ఊరేగింపుగా రామానుజాచార్యుల వారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అహోబిల మఠం వద్దకు చేరుకున్న పల్లకి లో కొలువైన ప్రహ్లాద వరద స్వామికి పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి పూజలు చేశారు. మోహిని అలంకారంలో ఉన్న ప్రహ్లాద వరద స్వామి, అమ్మవార్ల ను ఊరేగింపుగా చత్రవట నరసింహ స్వామి ఆలయం వద్దకు తీసుకొని వెళ్లి అక్కడ ఛత్రవట నరసింహస్వామి ఎదుట ఉంచి వేద పండితులు వేదపారాయణం చేసిన అనంతరం ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు, అర్చక బృందం పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఉత్సవ మూర్తులైన శ్రీ ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు పంచామృతాభిషేకం నిర్వహించారు. రాత్రి ప్రహ్లాద వరద స్వామి శరభ వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనం ఇచ్చారు. అనంతరం మాడ వీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి బ్రహ్మోత్సవాల లో పాల్గొన్నారు.