Friday, November 22, 2024

విశాఖలో అగ్నిపథ్‌ సెలక్షన్స్‌.. ఆగస్టు 14 నుంచి రిక్రూట్‌మెంట్..

అమరావతి, ఆంధ్రప్రభ:దేశవ్యాప్తంగా అగ్నివీరుల ఎంపిక ప్రారంభమైన నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో సెలెక్షన్స్‌ ప్రక్రియ షురూ అయింది. ఆగస్టు 14వ తేదీ నుంచి రాష్ట్రంలో అగ్నివీరుల ఎంపిక కొనసాగనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ఓ వైపు ఆసక్తి చూపుతున్న అభ్యర్ధుల నుంచి సానుకూల స్పందన లభిస్తుండగా, మరోవైపు వివిధ రాజకీయ పార్టీలు, పలు సంఘాలు వ్యతిరేకతను ప్రదర్శిస్తూనే ఉన్నాయి. త్రివిధ దళాల్లో రిక్రూట్‌మెంట్‌ విధానంలో సంస్కరణలు తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన అగ్నిపథ్‌ పథకం దేశంలో చిచ్చు రేపిన విషయం తెలిసిందే. ఇప్పటికీ అగ్నిపధ్‌పై వ్యతిరేకత కొనసాగుతూనే ఉంది. కొద్దిరోజుల క్రితం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలలో పెద్ద ఎత్తున అగ్నిపధ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమం లో పలుచోట్ల పెద్ద ఎత్తున అల్లర్లు, హింసాకాండకు దారి తీసింది. తెలంగాణాలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఆందోళనకారులు నిప్పుపెట్టిన ఘటన ప్రభావంతో ఏపీలో కూడా గుంటూరు, పలు చోట్ల అగ్నిపధ్‌కు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. అయినప్పటికీ ఏమాత్రం వెనుకడుగు వేయని కేంద్ర ప్రభుత్వం అగ్నివీరుల ఎంపిక చేపట్టడం ఖాయమంటూ ప్రకటన కూడా చేసింది. కాగా అగ్నిపధ్‌కు వ్యతి రేకంగా సుప్రీంకోర్టులో పిల్‌ కూడా దాఖలైంది. అయితే త్రివిధ దళాల్లో రిక్రూట్‌ మెంట్లన్నీ ఇక నుంచి అగ్నిపధ్‌ స్కీము ద్వారానే జరుగుతాయని తేల్చి చెప్పిన రక్షణ శాఖ తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఏంపిక ప్ర్రక్రియను ప్రకటించింది.

దీంతో కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంతోపాటు రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లా, అనకాపల్లి, కోనసీమ, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్‌ తదితర జిల్లాలకు చెందిన అభ్య ర్థులకు విశాఖ పట్నంలో ఏంపిక ప్రక్రియ జరుగనుంది. ఆగస్టు 14వ తేదీ నుంచి 31వ తేదీ వరకు విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అగ్నివీరుల ఎంపి కలు ఉంటాయని రక్షణ శాఖ పేర్కొంది. కాగా ఈనెల 30వ తేదీలోగా రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ రిజిస్ట్రేషన్‌ అన్‌లైన్‌ ద్వారా చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. ఆన్‌లైన్‌ ద్వారానే అభ్యర్ధులకు ఆగస్టు 7వ తేదీ నుంచి అడ్మిట్‌ కార్డులు జారీ అవుతాయి. అభ్యర్ధులు మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకునేందుకు ఆర్మీ కాలింగ్‌ మొబైల్‌ యాప్‌ను వినియోగించుకునే అవకాశం అధికారులు కల్పించారు. అదేవిధంగా విశాఖ ఆర్మీ రిక్రూట్మంట్‌ కార్యాలయంలో సంప్రదించవచ్చు. ఇదిలావుండగా రాష్ట్రంలో అగ్నిపధ్‌ పధకం కింద తొలిదశలో ప్రారంభమవుతున్న సెలక్షన్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఏ విధమైన అవాం ఛనీయ సంఘటనలు జరుగకుండా రక్షణ శాఖ అన్ని విధాలు చర్యలు చేపట్టింది. రెండోదశలో మిగిలిన జిల్లాల అభ్యర్ధులకు కూడా ఏంపికకు సంబంధించి ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement