హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడుల మధ్య ఈనెల 6న జరిగే కీలక భేటీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. విభజన సమస్యలు పరిష్కరించుకునేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు రాసిన లేఖకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. అయితే ఈ సమావేశంలో చర్చించాల్సిన ఎజెండాను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. అలాగే ఇతర ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
సీఎంల సమావేశ ఎజెండాపై సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులతోనూ చర్చించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు కావడంతో హైదరాబాద్‌లోని ఆస్తులు, ఇతర పెండింగ్ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన అంశాలను గతంలోనే కేబినెట్ సమావేశం ఎజెండాలో పొందుపరిచింది.
అయితే లోక్‌సభ ఎన్నికల పోలింగ్ వరకు ఆ అంశాలపై చర్చించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో ఈ విషయాన్ని పక్కన పెట్టింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో విభజన సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సీఎం రేవంత్ భావించారు. ఈ నేపథ్యంలో ఈనెల 6న చర్చించాల్సిన అంశాలపై ఎజెండాను అధికార యంత్రాంగం సిద్ధం చేస్తోంది.
పునర్విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో ఉన్న ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థిక సంఘం తదితర 23 కార్పొరేషన్ల ఆస్తుల అంశాన్ని ఎజెండాలో చేర్చాలని నిర్ణయించారు. పదో షెడ్యూల్‌లోని ఉన్నత విద్యామండలి, తెలుగు అకాడమీ, అంబేడ్కర్ యూనివర్శిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ, హైకోర్టు, రాజ్‌భవన్, లోకాయుక్త, ఆర్థిక సంస్థ వంటి 30 సంస్థల ఆస్తులు, సేవలపై కూడా సీఎంల భేటీలో చర్చించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
రాజ్‌భవన్, హైకోర్టు, లోకాయుక్త, కార్మిక సంక్షేమ నిధి, వాణిజ్య పన్నులు, విద్యుత్ సంస్థల బకాయిలపైనా వివాదాలు ఉన్నాయి. వీటన్నింటిపై రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ పలు సమావేశాలు నిర్వహించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ముఖ్యమైన చిక్కులను ముఖాముఖి చర్చలతో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు చొరవ చూపడంతో రెండు రాష్ట్రాలకు సంబంధించి ఏళ్ల తరబడి పెండింగులో ఉన్న విభజన సమస్యలు కొలిక్కి రావచ్చని ఇరు రాష్ట్రాలు ఆశిస్తున్నాయి.