Thursday, November 21, 2024

మళ్లీ తెరమీదకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ స్కాం.. రంగంలోకి ఈడీ

అమరావతి, ఆంధ్రప్రభ : ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణంపై తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న సుమారు రూ. 234 కోట్ల నిధుల మళ్లింపు వ్యవహారంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో సీఐడి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నిరుద్యోగులకు శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పన కోసం గత ప్రభుత్వం విడుదల చేసిన నిధులు దుర్వినియోగం అయ్యాయని భావించిన జగన్‌ సర్కార్‌ సీఐడీకి విచారణను అప్పగిస్తూ గత ఏడాది ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీఎస్‌ఎస్‌డిసి చైర్మన్‌ కె అజయ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు సిఐడి 2021 డిసెంబర్‌ 9వ తేదీన కేసు నమోదు చేసింది. కాగా ఇందులో మనీలాండరింగ్‌ కోణం ఉందని భావించిన సీఐడీ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌కు సమాచారం ఇచ్చింది. దీంతో ఈ కుం భకోణంపై తాజాగా దృష్టి సారించి న ఈడీ అధికారులు వివిధ కంపెనీలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న 26 మందికి నోటీసులు జారీ చేశారు. మొత్తం 234 కోట్ల నిధుల మళ్లింపు పై ఈడీ కేసు నమోదు చేసింది.

అసలు ఏం జరిగిందంటే..

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డిసి)లో స్కాంకు సంబంధించి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సిఐడి అధికారులు గత ఏడతాది డిసెంబర్‌లో విచారణ షురూ చేశారు. నకిలీ ఇన్వాయిస్‌లతో నిధులు మళ్లింపు చోటు చేసుకుందని వెల్లడైంది. ఢిల్లీకి చెందిన విపిన్‌ శర్మ, నీలం శర్మదంపతులు కీలకంగా వ్యవహరించారు. ఢిల్లీలో ఇన్‌ వెబ్‌ సర్వీసెస్‌ అనే ఓ షెల్‌ కంపెనీని నిర్వహిస్తున్నట్లు, ఏపీఎస్‌ఎస్‌డిసి నిబంధనలకు విరుద్ధంగా సీమెన్స్‌, డిజైన్‌ టెక్‌ కంపెనీలకు నిధులు చెల్లించింది. ఈ నిధులను సీమెన్స్‌, డిజైన్‌ టెక్‌ వివిధ షెల్‌ కంపెనీల రూపంలో దారి మళ్లించాయి.

ఈ క్రమంలో పూణేకు చెందిన స్కిల్లర్‌ అనే షెల్‌ కంపెనీ ద్వారా నకిలీ ఇన్వాయిస్‌లతో నిధులు కొల్లగొట్టిన ట్లు సిఐడి విచారణలో వెలుగు చూసింది. అప్పటి ప్రభుత్వంలో ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్‌ ప్రభుత్వం తరఫున 10 శాతం వాటాగా జీఎస్టీతో కలుపుకుని రూ.371 కోట్ల నిధులను సీమెన్స్‌ఇండియా, డిజైన్‌ టెక్‌లకు చెల్లిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ కుంభకోణంలో ఏపీఎస్‌ఎస్‌డీసీకి అప్పట్లో డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి కె.లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు కీలకంగా వ్యవహరించారు. ఈ ప్రాజెక్టు కోసం ఒప్పందం కుదుర్చుకున్న సీమెన్స్‌ కంపెనీ కమిటీలో సభ్యుడైన జీవీఎస్‌ భాస్కర్‌ భార్య అపర్ణ ఉపాధ్యాయను డిప్యూటీ సీఈఓగా నియమించారు.

ఈమె నియామకం నిబంధనలకు విరుద్ధంగా సిఐడి గుర్తించింది. అదేవిధంగా సీమెన్స్‌ ఇండియా, డిజైన్‌ టెక్‌ల నుంచి బ్యాంకు గ్యారంటీ కూడా లేదని విచారణలో తేలింది. సీమెన్స్‌ కంపెనీ సరఫరా చేసిన రూ.56 కోట్ల సాఫ్ట్‌వేర్‌, మరికొన్నింటికి చెల్లింపులు జరిగాయి. మిగిలిన రూ.241 కోట్లను నకిలీ ఇన్వాయిస్‌లతో షెల్‌ కంపెనీలు, బినామీ కంపెనీ డిజైన్‌ టెక్‌ ఖాతాలోకి మళ్లించారు. ఇదిలావుండగా కేంద్ర జీఎస్టీ అధికారులు 2017లో పూణేలోని కొన్ని సంస్థలపై నిర్వహించిన తనిఖీల్లో ఈ నకిలీ ఇన్వాయిస్‌ల వ్యవహారం వెలుగు చూడటంతో ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్టుకు సంబంధించినవిగా గుర్తించి ఇక్కడి ఏసీబికి సమాచారం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement