Friday, November 22, 2024

Big story : రెండేళ్ల తర్వాత తిరుమలకు ఉత్సవ శోభ.. అంకురార్పణతో మొదలు

తిరుమల/అమరావతి: ప్రభన్యూస్‌ :కోవిడ్‌ మహమ్మారి కారణంగా రెండేళ్లపాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు, శరన్నవరాత్రి వేడుకలకు దూరంగా ఉండిపోయిన భక్తులు ఈసారి కనులారా తిలకించేందుకు అవకాశం కలుగుతోంది. రాష్ట్రంలో రెండేళ్ల తర్వాత ఉత్సవ శోభ అలరిస్తోంది. అటు బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధంగా కాగా ఇటు శరన్నవరాత్రి వేడుకలకు ఇంద్రకీలాద్రి సహా ఇతర శక్తి క్షేత్రాలు ముస్తాబైనాయి. అన్ని ఉత్సవాలకు భక్తులను అనుమతిస్తుండటంతో రెండేళ్ల తరువాత మళ్లి దివ్యక్షేత్రాలు భక్తులతో కళకళలాడుతున్నాయి.

తిరుమలలో రేపు (సోమవారం) అంకురార్పణ

కలియుగ వైకుంఠనాధుడు శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్వాలకు ముహూర్తం సమీపించింది. సాక్షాత్తు బ్రహ్మదేవుడే దగ్గరుండి ఈ ఉత్వాలను నిర్వహిస్తారని ప్రతీతి. కన్యామాసం (ఆశ్వయుజయం)లోని శ్రవణానక్ష్తత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించారట. అందువల్లే ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈనెల 27 నుంచి అక్టోబర్‌ 5 వ తేదీవరకు తొమ్మిది రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తి అయిన శ్రీమలయప్పస్వామివారు వివిధ వాహనాలపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్యదర్శనమిస్తారు. ప్రపంచ మానవాళి సంక్షేమాన్ని కాంక్షించడంతో పాటు శ్రీవేంకటేశ్వరస్వామివారి దివ్యమైన ఆశీస్సులను భక్తులందరికి అందించేందుకు శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహిస్తుంది. ఈ తొమ్మిది రోజులు ఉదయం వాహనసేవ 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడ వాహన సేవ రాత్రి 7 నుంచి అర్దరాత్రి ఒంటిగంట వరకు జరుగుతుంది.

సోమవారం అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమౌతాయి. ఈ నేపథ్యంలో నేటి రాత్రి శ్రీవారి ఆలయానికి నైరుతి దిక్కుగా ఉన్న వసంత మండపానికి ఛత్ర చామర మంగళవాయిద్యాలతో చేరుకుని నిర్ణీత ప్రదేశంలో భూదేవి ఆకారంనందు లలాట బాహుస్థన ప్రదేశాల నుండి మట్టిని తీసుకుని ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. యాగశాలలను ఈ మట్టితో నింపిన 9 కుండలలో నవధాన్యాలుంచుతారు. ఈ కార్యక్రమానికి చంద్రడు అధిపతి, శుక్లపక్ష చంద్రునిలా నవధాన్యాలు దినదినాభివృద్ధి చెందేలా మొల కెత్తిెంప చేస్తారు దీనినే అంకురార్పణ అంటారు. ఈ సందర్భాన్నిపురస్కరించుకుని శ్రీస్వామివారి సేనాధిపతులైన శ్రీవిశ్వక్సేనుల వారు వసంత మండపానికి చతురంగబలంగా వెళ్ళి దిక్పాలకులను సకలపరివార దేవతలను బ్రహ్మోత్సవాలకు రమ్మని ఆహ్వానం పలికి ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఈ సందర్భంగా నేడు నిర్వహించాల్సిన వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.

27న (మంగ‌ళ‌వారం) ధ్వజారోహణం..

- Advertisement -

శ్రీవారి ఆలయంలో మంగళవారం సాయంత్రం 5.45 నుంచి 6.15 గంటల మధ్య మీనలగ్నంలో ద్వజారోహణం జరుగుతుంది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాయిద్యాలు మేగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సకలదేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ఆ తరువాత రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్దశేషవాహన సేవ జరుగుతుంది.

బ్రహ్మోత్సవంలో వాహన సేవలు ఇలా

27-09-2022 ధ్వజారోహణం (సా||5.45 6.15 గం|| మధ్య) పెద్దశేష వాహనం
28-09-2022 చిన్నశేష వాహనం హంస వాహనం
29-09-2022 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
30-09-2022 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
01-10-2022 మోహినీ అవతారం గరుడ వాహనం
02-10-2022 హనుమంత వాహనం సా|| 4 గం|| స్వర్ణ రథోత్సవం గజ వాహనం
03-10-2022 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
04-10-2022 రథోత్సవం (ఉ||7.00) అశ్వ వాహనం
05-10-2022 చక్రస్నానం ధ్వజావరోహణం.

రెండేళ్ల తర్వాత మళ్లి భక్తులకు అనుమతి..

కరోనా కారణంగా రెండేళ్ళ తరువాత మాడవీధుల్లో బ్రహ్మోత్సవ వాహన సేవలు నిర్వహించనున్నందున విశేషంగా విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. భక్తులందరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారి వాహన సేవలతో పాటు మూలవిరాట్‌ దర్శనం కల్పించేందుకు టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఆలయ నాలుగు మాడవీధులలో భక్తులను ఆకట్టుకునేలా రంగవల్లులు తీర్చిదిద్దారు. గ్యాలరీల్లో వేచివుండే భక్తుల సౌకర్యార్థం తాగునీట సౌకర్యం కల్పించారు. భక్తులు మాడవీధుల్లోని గ్యాలరీల్లోకి ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బారికేడ్లు, క్యూ లైన్‌ల గేట్లు పటిష్టంగా ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement