విజయనగరం : ఏమమ్మా మీకు పింఛన్ వస్తుందా.. చేయూత వచ్చిందా.. మీ పిల్లలకు అమ్మఒడి డబ్బులు పడ్డాయా.. పాఠశాలల రూపు రేఖలు మారాయా.. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతుందా.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉంది? మీకు ఏ సమస్య వచ్చినా మా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు అందుబాటులో ఉంటున్నారా.. మళ్లీ జగన్ ను ముఖ్యమంత్రిని చేద్దాం.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి మీ మద్దతు తెలపండి అని ఏపీ శాసనసభ ఉపసభాపతి, విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. జగనన్నే మా భవిష్యత్తు- మా నమ్మకం నువ్వే జగన్ ప్రారంభ కార్యక్రమాన్ని శుక్రవారం విజయనగరంలోని ఒకటవ డివిజన్లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. ప్రభుత్వ పని తీరుపై వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ప్రభుత్వం ముద్రించిన కరపత్రాలను చదువుతూ, వారు ఏయే సంక్షేమ పథకాల లబ్ధి పొందారో అడిగి తెలుసుకున్నారు.
అవినీతి, మధ్యవర్తిత్వం లేకుండా పథకాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. గత ప్రభుత్వానికి.. ప్రస్తుత జగన్ ప్రభుత్వానికి మధ్య తేడాను వివరించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. పలువురు వృద్ధులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ… తమకు ప్రతినెల ఇంటికే పింఛన్ తెచ్చిస్తున్నారని, మా ఇంట్లో పిల్లలకు అమ్మఒడి అందుతుందని.. ప్రభుత్వ పాఠశాలల్లో చక్కగా చదువుకుంటున్నారని తెలిపారు. పలువురు మహిళలు మాట్లాడుతూ.. చేయూత, ఆసరా వంటి పథకాలతో తమ ఇంట్లో వెలుగులు నిండుతున్నాయని వివరించారు. నేరుగా తమ ఖాతాల్లోకి డబ్బులు పడుతుండటం వల్ల గతం మాదిరి అవినీతికి తావు ఉండటం లేదని చెప్పారు. మళ్లీ మళ్లీ ఈ ప్రభుత్వమే రావాలని తామంతా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ప్రజల అనుమతితో “జగనన్నే మా భవిష్యత్తు” స్టిక్కర్లను ఆయా ఇళ్ల వద్ద కోలగట్ల అతికించారు. ఇంకేమైనా సమస్యలు ఉంటే.. 82960 82960 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలని, వెంటనే పరిష్కరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రభుత్వానికి తమ మద్దతు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు బంగారమ్మపేట ప్రచారంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ రేవతీ దేవి , పార్టీ జోనల్ ఇన్చార్జులు, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.