భీమవరం – నాలుగేళ్ల విరామం తర్వాత వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీలో అడుగుపెట్టారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి విమానంలో చేరుకున్న ఆయనకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. గజమాలతో ఆహ్వానం పలికారు. భారీ సంఖ్యలో ఎయిర్ పోర్టుకు చేరుకున్న అభిమానులతో ఆ ప్రాంతం కిక్కిరిసి పోయింది. టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. రఘురాజు అనుకూల నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తి పోయింది.
ఇక రఘురామరాజు కూడా అభిమానులకు ఉత్సాహంగా షేక్ హ్యాండ్ ఇస్తూ ముందుకు సాగారు. రాజమండ్రి నుంచి భీమవరంకు ఆచంట, పాలకొల్లు మీదుగా ఆయన భారీ ర్యాలీగా తన స్వగ్రామానికి తరలివెళ్లారు… ఆయన వెంట వందలాది కార్లు రఘురామరాజును అనుసరించాయి… ఈ సంక్రాంతిని తన నియోజకవర్గంలో ఆయన బంధుమిత్రులతో కలిసి జరుపుకోనున్నారు.
ఈ సందర్భంగా రఘురామ రాజు మాట్లాడుతూ.. ”నాలుగేళ్ల తర్వాత భీమవరం వెళ్లడం సంతోషంగా ఉంది. నేను జైలులో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ అందించిన సహకారం మరవలేనిది. అభిమానులు, తెదేపా, జనసేన నాయకులు చూపిన ప్రేమ మరవలేను. సొంత వారెవరో పరాయి వారెవరో అర్థమవుతోంది. మా నానమ్మ చనిపోయినప్పుడు కూడా నేను మా ఊరు రాలేదు” అని అన్నారు. కాగా, తాను స్వంత ఊరు వెళితే అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆయన హైకోర్టు ఆశ్రయించారు.. ఆయన వాదనలు విన్న కోర్టు ఎంపిని అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.. దీంతో ఆయన తన ఊరికి నేడు చేరుకున్నారు..