అధికారంలో లేకపోయే సరికి చంద్రబాబుకు హైదరాబాద్ గుర్తుకు వస్తుందని.. 2024 ఎన్నికల తరువాత జగన్ కూడా హైదరాబాద్ లో కూర్చుంటారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు జోస్యం చెప్పారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు, జగన్‌కు అధికారం కోసం ఏపీ కావాలి కానీ.. ప్రతిపక్షంలో ఉంటే మాత్రం హైదరాబాదే కావాలన్నారు. కాపులకు రిజర్వేషన్లు కేంద్రం ఇవ్వడం లేదని అబద్దాలు చెప్పారని, పార్లమెంటు సాక్షిగా కాపుల రిజర్వేషన్ కరెక్ట్ అని తేలిందన్నారు. కాపులకు బీజేపీ అండగా ఉందన్నారు.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్రం కేటాయించిన పది శాతం కోటాలో ఐదు శాతం కాపులకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారని, అయితే ఇది చెల్లదని జగన్ ప్రభుత్వం తర్వాత రద్దు చేసిందన్నారు. పార్లమెంట్ ఇటీవల ఆ నిర్ణయం చెల్లుతుందని రిజర్వేషన్లు ఇవ్వవొచ్చని తెలిపిందన్నారు. దీన్నేగుర్తు చేసి.. జీవీఎల్ ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ నిపుణులు ఏపీకి చెందిన పది శాతం మందికిపైగా ఉన్నారని, కానీ ఏపీ నుంచి ఐటీ రంగ ఉత్పత్తులు, ఎగుమతులు వాటా జీరో అని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వానికి ఏమైనా బాధ్యత ఉందా అని నిలదీశారు. ఇక్కడ ఐటీని ఎందుకు ముందుకు తీసుకెళ్ల లేదని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేశామని చెప్పుకునే వాళ్లు ఏపీకి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.