– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో ఒక దారుణమైన హత్య జరిగింది. తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడేమో అని అనుమానంతో తోటి ఉద్యోగిని ఒక ఔట్ సోర్సింగ్ పంచాయతీ ఉద్యోగి దారుణంగా చంపేశాడు. బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ హత్యను తన కుమారుడితో కలిసి చేయడం అన్నది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఆ మైనర్ బాలుడికి కూడా చిక్కులు తప్పేలా లేవు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి పంచాయతీలో సైదులు, కోటేశ్వరరావు అనే ఇద్దరు అవుట్ సోర్సింగ్‌లో ప్లంబర్లుగా పనిచేస్తున్నారు. దీంతో ఒకరి ఇంటికి ఒకరు వచ్చిపోతూ ఉండేవారు. అయితే తన భార్యతో కోటేశ్వరరావు ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్నాడని సైదులుకు అనుమానం వచ్చింది.
ఇదే విషయాన్ని భార్యను పలమార్లు అడిగినా ఆమె కాదన్నది. కానీ, కోటేశ్వరరావు మీద సైదులుకు అనుమానం తగ్గలేదు. ఈ క్రమంలో తన విధి నిర్వహణలో భాగంగా కోటేశ్వరరావు విద్యుత్ మోటార్ ఆపివేసేందుకు ఒక ప్రాంతానికి వెళ్లగా అప్పటికే అక్కడ కాచుకుని ఉన్న సైదులు, అతని కుమారుడు ఇద్దరూ దారి కాచి ఇనప రాడ్లతో అటాక్ చేశారు. దీంతో కోటేశ్వరరావు అక్కడికక్కడే రక్తపు మడుగులో ప్రాణాలు వదిలేశాడు. దీంతో అతని మృతదేహాన్ని సంచిలో వేసుకుని సైదులు తన పొలం వద్దకు తీసుకు వెళ్లాడు. కోటేశ్వరరావు మృతదేహాన్ని పొలంలోకి తీసుకెళ్లి మిర్చి పంట మధ్యలో వేసి సుమారు 16 ముక్కలుగా కోసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
అయితే.. కోటేశ్వరరావు ఎటు వెళ్లినా సాయంత్రం వరకు ఇంటికి వచ్చేస్తాడు. కానీ, ఆరోజు రాత్రి 10:00 అవుతున్నా ఎంతకూ రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వెతుకులాట ప్రారంభించారు. అన్నిచోట్లా వెతుకుతూ సైదులు పొలం దగ్గరికి కూడా వచ్చి అడిగారు. అయితే.. తమకేమీ కనిపించలేదని తండ్రీకొడుకులు చెప్పి, హడావుడిగా వెళ్లిపోతుండడంతో వారి మీద అనుమానం వచ్చింది. అక్కడికి దగ్గర్లోనే వెలుగుతున్న మంట దగ్గర పరిశీలిస్తే కోటేశ్వరరావు పాదం కనిపించింది.
దీంతో వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు సైదులు, అతని కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమికంగా వారు హత్య చేసినట్లు ఒప్పుకున్నా సరే వివాహేతర సంబంధం కోణంలోనే హత్య చేశారా? లేక ఆర్థిక లావాదేవీలు వంటివి ఏమైనా ఉన్నాయా? అనే విషయం మీద కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.