Wednesday, November 20, 2024

డబ్బులు పొలంలో వెదజల్లి… కారుతో సీఐని ఢీకొట్టి .. అవినీతి ఎ ఈ జంప్

పార్వతీపురం – విద్యుత్తు కనెక్షన్‌ ఇచ్చేందుకు రైతు నుంచి లంచం డిమాండ్‌ చేసిన విద్యుత్తు శాఖ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ)..ఆ మొత్తం తీసుకునే క్రమంలో అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కకుండా పలాయనం చిత్తగించారు. అయినా ఏసీబీ అధికారులు వెంటపడటంతో సీఐని కారుతో ఢీకొట్టి మరీ పొలాల్లోంచి పరుగు లంకించారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలో ఆదివారం రాత్రివేళ జరిగిన ఈ ఘటనపై ఏసీబీ పోలీసుల కథనం ప్రకారం.. ములక్కాయవలసకు చెందిన రైతు డి.ఈశ్వరరావు తన పొలానికి కనెక్షన్‌ మంజూరు చేయాలని విద్యుత్తు ఏఈ శాంతారావును కోరారు. దరఖాస్తు పేరుతో ఫోన్‌పే ద్వారా రూ.4 వేలు ఆయన సూచించిన మేరకు చెల్లించారు. కనెక్షన్‌ ఇవ్వడానికి రూ.60 వేలు లంచం ఇవ్వాలని డిమాండు చేసిన ఏఈ.. రూ.20 వేలు అడ్వాన్స్‌గా తీసుకున్నారు. మిగిలిన సొమ్ము కోసం డిమాండు చేయగా, రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు

విద్యుత్తు కనెక్షన్‌ ఇచ్చిన తర్వాత ఆదివారం సాయంత్రం మిగిలిన లంచం డబ్బులు పొలం దగ్గర ఇస్తానని రైతు చెప్పడంతో ఏఈ శాంతారావు అంగీకరించారు. రాత్రి పొలం దగ్గరకు వచ్చిన ఏఈ కారులో కూర్చుని ఈశ్వరరావును వాహనంలోకి రమ్మని పిలిచి మిగిలిన రూ.40 వేలు తీసుకున్నారు. అప్పటికే దూరం నుంచి గమనిస్తున్న ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు, సీఐ టి.శ్రీనివాసరావులు ద్విచక్ర వాహనంతో కారు వద్దకు చేరుకున్నారు. వారిని గమనించిన ఏఈ కారును పక్కనే పొలాల్లోకి వేగంగా నడిపారు. గట్ల పైనుంచి కారు ఎగురుతూ వెళ్లడం చూసిన రైతులు ఆశ్చర్యపోయారు. కారును అడ్డగించి ఏఈని పట్టుకునేందుకు బైకుపై సీఐ కొంతదూరం వెంబడించారు. ఏఈ కారుతో బైక్‌ను ఢీకొట్టడంతో సీఐ కిందపడి గాయాలపాలయ్యారు. కొంతదూరం వెళ్లాక శాంతారావు లంచం డబ్బులు విసిరేసి, కారు వదిలేసి కాలికి పని చెప్పారు.

పట్టుబడకపోతే తీవ్ర పరిణామాలు: డీఎస్పీ

- Advertisement -

లంచం తీసుకుని తప్పించుకుపోవడమే కాకుండా పట్టుకునేందుకు యత్నించిన సీఐ వాహనాన్ని ఢీకొట్టిన ఏఈపై తీవ్ర చర్యలు తప్పవని ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు హెచ్చరించారు. ఆయన విద్యుత్తు శాఖ ఎస్‌ఈకి ఫోన్‌ చేసి మాట్లాడారు. శాంతారావు స్వచ్ఛందంగా లొంగిపోకుంటే పరిస్థితి వేరేగా ఉంటుందని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఏడీఈ శంకరరావు మక్కువలోని కార్యాలయానికి చేరుకుని ఏసీబీ అధికారులకు వివరాలు అందించారు. శాంతారావు నేపథ్యాన్ని అధికారులు అర్ధరాత్రి వరకూ సేకరించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement