అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జూన్ 4న జరగబోయే, ఓట్ల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. దీని కోసం వరుస సమీక్షలు నిర్వహిస్తోంది. కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, ఈసీ దిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది.
వీడియో కాన్ఫరెన్సు ద్వారా, ఈ సమీక్షలో సమీక్షలో సీఈవో ముఖేష్ కుమార్ మీనా పాల్గొన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల ఓట్ల లెక్కింపుపై సీఈసీ చర్చించారు. కౌంటింగ్ ఏర్పాట్లు, భద్రతా చర్యలపై పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశించారు.
ఎన్నికల ఫలితాల ప్రకటన విషయంలో ఏమాత్రం జాప్యం చేయకుండా భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాలను ప్రకటించాలన్నారు. ఐదు దశల్లో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల సీఈవోలు, ఆయా నియెజకవర్గాల ఆర్వోలు, జిల్లాల ఎన్నికల అధికారులతో ఎలక్షన్ కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సందుతో కలసి సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి ఓట్ల లెక్కింపుకు చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు.
నిరంతరాయంగా విద్యుత్, అత్యవసర ఆరోగ్య సేవలు..
కౌంటింగ్ కేంద్రాల వద్ద నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఈసీఐ చీఫ్ రాజీవ్ కుమార్ ఆదేశించారు. పవర్ బ్యాక్అప్, ఫైర్ సేప్టీ పరికరాలను సిద్దంగా ఉంచుకోవాలని, అత్యవసర ఆరోగ్య సేవలు అందజేసేందుకు అంబులెన్సులను కూడా సిద్దంగా ఉంచుకోవాలన్నారు. దశల వారీగా దేశవ్యాప్తంగా జరుగుచున్న సార్వత్రిక ఎన్నికలను అందరి సమిష్టి కృషితో ఎంతో విజయవంతంగా జరుగుచున్నదని అభినందించారు.
అదే స్పూర్తితో వచ్చే నెల 4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు రోజు ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూవ్లు వద్ద క్రౌడ్ మేనేజ్మంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, నిర్ణీత పాస్ లేకుండా ఎవరినీ అనుమతించవద్దన్నారు.
డిస్ప్లే బోర్డుల ద్వారా ఎన్నికల ఫలితాలు..
డిస్ ప్లే బోర్డుల ద్వారా ఎప్పటికప్పుడు ఖచ్చితమైన ఎన్నికల ఫలితాలను ప్రకటించాలని ఈసీఐ చీఫ్ రాజీవ్ కుమార్ సూచించారు. ఈవీఎంలలో పోల్ అయిన ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్నికల అధికారులు, సిబ్బందికి ముందస్తుగానే సరైన శిక్షణ నివ్వాలన్నారు. సుశిక్షితులైన ఎన్నికల సిబ్బందితో పాటు కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్ వంటి ఐ.టి. పరికాలను ముందస్తుగా ఓట్ల లెక్కింపు కేంద్రాల సిద్దంగా ఉంచుకోవాలన్నారు.
కౌంటింగ్ రోజు లెక్కించే ఈవీఎంలను ఎడాపెడా పడేయకుండా ఒక క్రమ పద్దతిలో తీసుకురావడం, ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తదుపరి లెక్కింపు పూర్తి అయినట్లుగా ఆయా ఈవీఎంలపై మార్కుచేస్తూ వెంటనే వాటిని సీల్ చేసి ఒక క్రమపద్దతిలో సురక్షితంగా భద్రపర్చాలన్నారు. అనవసరంగా ఈవీఎంలను అటూ ఇటూ మువ్ చేయవద్దని సూచించారు.
ఎలక్ట్రానిక్ ట్రాన్సుఫర్ పోస్టల్ బ్యాలెట్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను చక్కగా నిర్వహించాలని, వాటి లెక్కింపుకు సంబందించి ప్రత్యేకంగా టేబుళ్లను, స్కానర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
ఎన్నికల ఫలితాలను ప్రకటించే విషయంలో ఏమాత్రము ఆలశ్యం చేయవద్దని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, అదనపు సీఈఓలు పి కోటేశ్వరరావు, ఎమ్ఎన్ హరేంధిర ప్రసాద్ ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
అదే విధంగా ఐదు దశలో ఎన్నికలు జరిగిన ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిస్సా, సిక్కిం అసెంబ్లీలతో పాటు- 543 పార్లమెంటరీ నియోజకవర్గాలకు చెందిన ఆర్వోలు, డిఈఓ, ఆయా రాష్ట్రాల చీఫ్ ఎలెక్టోరల్ అధికారులు వారి ప్రాంతాల నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
రాష్ట్రంలో 33 ప్రదేశాల్లో 350 కౌంటింగ్ కేంద్రాలు
ఇదిలా వుండగా ప్రస్తుతం అందరి దృష్టి కౌంటింగ్ పైనే నెలకొని ఉంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను ఎలా లెక్కిస్తారు. ఎన్ని టేబుళ్లు వేస్తారు. ఎన్ని రౌండ్లు అనే విషయాన్ని ఎలా నిర్ధారిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి 33 ప్రదేశాల్లో 350 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ ఫలితాల లెక్కింపును జూన్ 4 తేదీ ఉదయం 8 గంటల నుంచి చేపట్టనున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించాక ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ఏపీలో 350 కౌంటింగ్ కేంద్రాలు
ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 4 తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, హోం ఓటింగ్‌కు సంబంధించిన ఓట్లను లెక్కించనున్నారు. ఎన్నికల కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. చీమ చిటుక్కుమన్నా సరే ఇట్టే పసిగట్టేలా మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 33 చోట్ల 350 కౌంటింగ్ కేంద్రాల్లో ఈ లెక్కింపు ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు సహా కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులతో హై సెక్యూరిటీ కొనసాగుతోంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌ల లోపల, బయట సీసీ కెమెరాలు అమర్చి ప్రత్యేక నిఘా ఉంచారు.
స్ట్రాంగ్ రూంలోకి వెళ్లేందుకు ఓకే ఎంట్రీ, ఎగ్జిట్ ఉండేలా ఏర్పాట్లు చేయడంతోపాటు స్ట్రాంగ్ రూంలకు రెండు తాళాలు వేసే వ్యవస్థను పెట్టారు. కౌంటింగ్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఓట్ల లెక్కింపులో ప్రతీ అంశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసేలా ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది.
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ
ఎన్నికల సంఘం నిబంధన మేరకు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. దీనికి ముందు నుంచే కౌంటింగ్‌కు సంబంధించిన కసరత్తు మొదలు అవుతుంది. ఉదయం 5 గంటలకు లెక్కింపు చేయాల్సిన టేబుళ్లను సంబంధింత అధికారులకు కేటాయింపు చేస్తారు. సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సిబ్బందితో ప్రమాణం కూడా చేయిస్తారు.
లెక్కింపులో గోప్యత పాటిస్తామని ప్రమాణం చేసిన తర్వాత 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో కౌంటింగ్ మొదలు కానుంది. 8.30 గంటల వరకూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించాక ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. పోస్టల్ ఓట్లు- ఎక్కువ ఉండి సమయం పడితే ఆ లెక్కింపు కొనసాగిస్తూనే ఈవీఎంల ఓట్ల లెక్కింపు కూడా చేస్తారు. ఒక నిమిషానికి 3 పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారని అంచనా.
ఈవీఎంల ఓట్ల లెక్కింపు
నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు, వాటి పరిధిలో పోలైన ఓట్లు ప్రాతిపాదికన ఎన్ని రౌండ్లు లెక్కింపు చేయాలో రిటర్నింగ్ అధికారులు నిర్ణయం తీసుకుంటారు. ఒక్కో రౌండ్‌కు 25 నుంచి 30 నిమిషాల సమయం వరకూ పడుతుంది. సగటున 14 – 15 టేబుళ్లపై లెక్కింపు చేసేలా నిర్ణయం అవుతుంది. ఒకసారి మొత్తం టేబుళ్లపై ఉన్న ఈవీఎంల లెక్కింపు పూర్తి అయితే ఒక రౌండ్ పూర్తయినట్టుగా నిర్ధారిస్తారు.
లెక్కింపు టేబుళ్లకు అనుగుణంగా ఏజెంట్లను రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. ఒక రౌండ్‌కు ఒక టేబుల్‌కు 1200 ఓట్ల వరకూ లెక్కింపు జరిగే అవకాశముంది. ఒక్కో రౌండ్‌కు దాదాపు 15 వేల ఓట్ల వరకూ లెక్కింపు జరిగే అవకాశముంది. ఈవీఎంలలోని రిజల్టు మీట నొక్కగానే కనిపించే ఓట్ల సంఖ్యతో పాటు అభ్యర్ధులకు వచ్చిన ఓట్లను లెక్కించి అధికారులు నమోదు చేసుకుంటారు.
ప్రతీ రౌండ్‌కు ఏజెంట్లు, మైక్రో అబ్జర్వర్ సంతకాలను తీసుకున్న తర్వాత ఎవరికీ అభ్యంతరం లేదన్న తర్వాతే ఫలితాలను వెల్లడిస్తారు. దీంతో పాటు ఈవీఎంల లెక్కింపు పూర్తి అయిన అనంతరం వీవీప్యాట్ స్లిప్‌లను కూడా లెక్కించే ప్రక్రియను కూడా ఈసీ నిర్దేశించింది. ప్రతీ నియోజకవర్గంలోనూ పోలింగ్ కేంద్రాల నెంబర్లను లాటరీ తీసి అనంతరం ఆయా వీవీ ప్యాట్ల స్లిప్పులను లెక్కించేలా నిర్ణయం తీసుకుంటారు.
ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్‌గా పిలిచే వీవీ ప్యాట్ లలో ఓటు వేసేటప్పుడే సదరు ఓటును ముద్రణ అవుతుంది. ఏదైనా వ్యత్యాసం ఉంటే రెండో మారూ లెక్కించిన అనంతరం ఫలితాన్ని నిర్ధారిస్తారు. వీవీ ప్యాట్లలో స్లిప్పుల లెక్కింపు పూర్తి అయ్యేంత వరకూ అధికారికంగా ఫలితాలను ప్రకటించరు.
వేర్వేరు స్థానాల్లో కానీ లెక్కింపు
ఎన్నికల్లో ఒక రౌండ్ ఫలితాలు ఈసీ అధికారికంగా ప్రకటించేందుకు కనీసం 30 నిమిషాల సమయం అవసరం అవుతుంది. ప్రతీ రౌండ్ పూర్తి అయిన తర్వాత అన్ని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు, మైక్రో అబ్జార్వర్, ఎన్నికల పరిశీలకుల సంతకాల తర్వాతే ఫలితాల వెల్లడి ఉంటుంది.
ఈవీఎంలలో వచ్చిన ఓట్లు, వీవీ ప్యాట్లలో వచ్చిన ఓట్లు సరిపోలాక ఏజెంట్లు ఎవరికి అభ్యంతరం లేదని చెప్పిన తర్వాత రిటర్నింగ్ అధికారి రౌండ్ ఫలితాలు అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ప్రక్రియలో ఏదైనా అభ్యంతరం ఉంటే ఓట్ల లెక్కింపు ఆలస్యం అయ్యే అవకాశముంటుంది. ఒక్కో ఈవీఎంలో 800 నుంచి 1200 ఓట్లు వరకూ నమోదు అయి ఉంటాయి. ప్రతీ రౌండ్‌కూ 14 టేబుళ్ల చొప్పున సరాసరి 14,000 నుంచి 15,000 ఓట్ల ఫలితాలు వెల్లడి అవుతాయి.
ప్రతీ నియోజకవర్గంలోనూ దాదాపు 17 నుంచి 20 రౌంట్లలోపు ఫలితాలు వెల్లడి అయ్యే అవకాశముంది. ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి బాధ్యతనూ సదరు రిటర్నింగ్ అధికారి బాధ్యత వహిస్తారు. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. ఈ పరిస్థితిలో రిటర్నింగ్ అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒకే చోట కానీ, వేర్వేరు స్థానాల్లో కానీ లెక్కింపు జరుగుతుంది.