Friday, November 22, 2024

AP | కల్తీ వంట నూనె వ్యాపారం గుట్టురట్టు.. మైలవరంలో అధికారుల తనిఖీలు

మైలవరం, (ప్రభ న్యూస్): ఏపీలోని ఎన్​టీఆర్​ జిల్లా, మైలవరంలో కొంతకాలంగా జరుగుతున్న కల్తీ నూనె వ్యాపారం గుట్టు రట్టయింది. గ్రామంలోని నూజివీడు రోడ్డులో కల్తీ నూనె తయారు చేసి విక్రయాలు సాగిస్తున్న ప్రదేశంపై రెవెన్యూ సిబ్బంది శనివారం దాడులు చేశారు. కల్తీ నూనె డబ్బాలను పరిశీలించారు. అప్పటికె తరలించేందుకు సిద్ధంగా ఉన్న కల్తీ నూనెలను తనిఖీ చేశారు. రెవెన్యూ సిబ్బంది వస్తున్నారన్న సమాచారంతో కొన్ని డబ్బాలలో నూనెను తయారీదారుడు అప్పటికే నెలపాలు చేయడం జరిగింది.

నూనె నుండి భరించలేని దుర్వాసన వస్తుండటంతో రెవెన్యూ అధికారులు పరిశీలన చేసి పూర్తి వివరాలు సేకరించారు. తయారీదారుడిని తహసీల్దార్ వద్దకు తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే తయారు చేసిన కల్తీ వంట నూనెలను స్థానికంగా ఉన్న కొన్ని చిన్న, చిన్న టిఫిన్ సెంటర్లు, బేకరీ, సమోసా సెంటర్లకు సరఫరా చేసి కాసులు దండుకుంటున్నట్లు సమాచారం. కల్తీ నూనెలతో తయారు చేసిన ఆహారం (టిఫిన్) తిన్న వారు అనారోగ్యానికి గురై ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇలాంటి ప్రబుద్ధులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు…

చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశాం: వీఆర్‌వో
కల్తీ నూనె విషయమై విఆర్ఓ తరుణ్ వివరణ కోరగా ఆయన స్పందిస్తూ ఈ విషయాన్ని తహసీల్దార్ శ్రీనివాసు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. తహసీల్దార్ ఆదేశానుసారం కల్తీ నూనె తయారు చేసి, విక్రయిస్తున్న వ్యక్తి నుండి స్టేట్​మెంట్​ రికార్డ్ చేశామని, కల్తీ నూనె నిర్ధారణ కోసం పంపించామని, అదేవిధంగా నిందితుడిపై చర్యలు తీసుకోవాలని జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కు సిఫార్సు చేసినట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement