Monday, November 25, 2024

Admin Capital – అంతా రెడీ.. విజయదశమికి ఛలో విశాఖ.. ఈ నెల 23న సీఎం జగన్ గృహ ప్రవేశం..

విజయదశమికి ఛలో విశాఖ.. ముహుర్తం ఫిక్సైంది. పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. ఇక మిగిలింది కేవలం మరో మూడు వారాలే. దీంతో అధికారులు అన్ని పనులను పూర్తిచేస్తున్నారు. దసరా పర్వదినం రోజున సీఎం జగన్ విశాఖపట్నంలో గృహప్రవేశానికి సిద్దమవుతున్నారు. మరో మూడువారాలకు మించి సమయం లేకపోవడంతో తాడేపల్లి నుంచి క్యాంప్ ఆఫీసు షిఫ్టింగ్‌కి రెడీ చేస్తున్నారు. ఈ నెల 23న గృహ ప్రవేశానికి ముహూర్తం కూడా ఖరారైంది. 24 నుంచి సీఎం జగన్ వైజాగ్ క్యాంప్ ఆఫీస్ నుంచి పాలన కొనసాగించనున్నారు. దీంతో యంత్రాంగం కూడా అంతే స్పీడ్‌తో కదులుతుంది. విశాఖపట్నం-భీమిలి బీచ్ రోడ్డులోని.. రుషికొండపై ఏపీ టూరిజం శాఖ శ్రద్ధ పెట్టి కడుతున్న కాంప్లెక్స్‌లోనే సీఎం నివాసం ఉండబోతున్నారు. సీఎం మాత్రమే కాదు.. అనుబంధ శాఖలకు సంబందించిన ఉన్నతాధికారులంతా ఇక్కడినుంచే కార్యకలాపాలు నిర్వహిస్తారని ఏపీ సర్కార్ ఇప్పటికే చెప్పేసింది. సీఎం విశాఖ పాలనపై ఎంపీ విజసాయిరెడ్డి సైతం తాజాగా స్పందించారు.

సీఎం హౌస్ పనులను పరుగులు పెట్టిస్తున్న టీడీసీ ఎండీ
టైం దగ్గర పడుతుండడంతో రుషికొండపై సీఎం క్యాంపాఫీసు నిర్మాణాన్ని వేగవంతం చేసింది టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. కార్పొరేషన్ ఎండి కన్నబాబు తరచూ విశాఖలో పర్యటిస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ డిఇసి ఆధ్వర్యంలో పనులు వేగంగా, నాణ్యతాప్రమాణాలతో జరుగుతున్నాయని చెబుతున్నారు అధికారులు. ఎట్టి పరిస్థతుల్లోనూ దసరా నాటికి సీఎం గృహ ప్రవేశం జరగాలన్నది నిర్ణయంగా తెలుస్తుంది. ఈ నెల 15కల్లా సీఎం ఇంటి పనులు పూర్తిచేసి సెక్యూరిటీ విభాగానికి అప్పగించాలి. కానీ.. మరికొంత టైమ్ కావాలి.. 20వ తేదీకి పక్కాగా పూర్తి చేస్తామంటోంది నిర్మాణ సంస్థ డిఇసి

కార్యాలయాల నిర్వహణకు 50 ఇళ్లు అద్దెకు..!

ప్రస్తుతానికి ఇంటీరియర్ వర్క్స్, దర్వాజాలు, ఇతర ఫినిషింగ్ టచెస్ జరుగుతున్నాయని, రేపో ఎల్లుండో ల్యాండ్ స్కేపింగ్ పనులు కూడా ప్రారంభమౌతాయని చెబుతున్నారు. ఇప్పటికే 8 కోట్ల రూపాయలతో కాంపౌండ్ వాల్, 4 కోట్లతో బ్యూటిఫికేషన్ పనులకు టెండర్లు పిలవడం, కాంట్రాక్టర్ల ఎంపిక పూర్తయింది. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసు ఒక్కటే కాదు.. అనుబంధంగా ఇతర కార్యాలయాల నిర్వహణకు మరో 50 ఇళ్లను విశాఖ బీచ్ రోడ్డులో అద్దెకు తీసుకున్నారు అధికారులు. వాటిని ఆధునీకరిస్తున్నారు. జిల్లా కలెక్టర్, విశాఖ న‌గ‌ర పాల‌క సంస్థ కమిషనర్ ఇదే పనిమీద బిజీగా ఉన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం విశాఖపట్నం షిఫ్ట్ అవుతున్న తరుణంలో భద్రతకు సంబంధించిన చర్యలను కూడా ప్రారంభించారు. సీఎం క్యాంప్ ఆఫీస్ తదితర ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement