(ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో) : ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు నేషనల్ మీడియాను సైతం ప్రభావితం చేసిన లైంగిక వేధింపుల బాదిత ముంబై హిందీ నటి కాదంబరి జత్వానీ విజయవాడకు చేరుకున్నారు. గడచిన నాలుగు రోజులుగా సంచలనమైన నటి వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో ఏపీ పోలీసులకు సహకరించేందుకు ఆమె ముంబై నుండి హైదరాబాద్ మీదుగా విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్ విమానాశ్రయం నుండి విజయవాడ పోలీసుల ప్రత్యేక బందోబస్తు మధ్య ఆమె శుక్రవారం నగరానికి చేరుకున్నారు.
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సినీనటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎక్స్ లోనూ, విజయవాడ పోలీసులకు ఆన్ లైన్ లోనూ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తన దగ్గర ఉన్న ఆధారాలను కేసు వివరాలను అందించేందుకు ఆమె విజయవాడ వచ్చారు. కేసుకు సంబంధించి ఇద్దరు ఐపీఎస్ అధికారులతో పాటు, ఇంకొందరి పోలీసు అధికారులు, సిబ్బంది, రాజకీయ నాయకుల ప్రమేయంపై నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు ఏసీపీ స్రవంతి రాయ్ ని ప్రత్యేక అధికారిగా నియమించిన తరుణంలో దర్యాప్తు బృందం నటి జత్వానీ విచారించి ఆమెపై గతంలో నమోదైన ఫోర్జరీ కేసు వివరాలను కూడా సేకరించనున్నారు. ఈ కేసులకు సంబంధించి విజయవాడ పోలీసులకు పూర్తి సహకారం అందించేందుకు ఆమె రెండు మూడు రోజులపాటు విజయవాడలోనే బస చేయనున్నారు.
అంతకు ముందు ఆమె ముంబై నుండి హైదరాబాదు విమానాశ్రయంకు చేరుకున్న సందర్భంలో విలేకరులతో మాట్లాడుతూ.. అక్రమ కేసులు పెట్టి తనను ఏపీ పోలీసులు అనేక విధాలుగా వేధించారన్నారు. తనను వేధించిన అధికారులకు సంబంధించి అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని, తన దగ్గర ఉన్న ఆధారాలన్నింటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందిస్తానన్నారు. తన కుటుంబ సభ్యులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నాకు సపోర్ట్ చేస్తుందని భావిస్తున్ననట్లు చెప్పారు.
సోషల్ మీడియాలో కొందరు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, డబ్బుల కోసమే మాట్లాడుతున్నానని నా వ్యక్తిత్వాన్ని హాననం చేస్తూ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఏపీ ప్రభుత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, తప్పకుండా తనకు న్యాయం జరుగుతోందని ఆమె చెప్పారు.