అమరావతి, ఆంధ్రప్రభ : ఏపీ పోలీసుశాఖలో 6551 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన క్రమంలో జిల్లాల వారీగా కానిస్టేబుల్ పోస్టుల ఖాళీలు, రేంజ్ల పరిధిలోని ఎస్ ఐ పోస్టుల ఖాళీలు ఏపీ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. డిసెంబర్ నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపధ్యంలో జనవరి, ఫిబ్రవరి నాటికి ఎంపిక పూర్తి చేసి అర్హత సాధించిన అభ్యర్ధులకు శిక్షణ ఇవ్వనుంది. దీంతో ట్రైనింగ్ పూర్తి చేసుకుని పూర్తిస్ధాయిలో ఉద్యోగంలో చేరేందుకు మరో ఏడాది పట్టనుంది. ఎలాగైనా తొలి దశలో భారీగా ప్రకటించిన ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.
దీనిలో భాగంగా ఎస్ఐలు, కానిస్టేబుళ్ళ ఖాళీల జాబితా జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఎస్ఐలు సివిల్ విభాగానికి సంబంధించి పురుషులు, మహిళలకు మొత్తం 315 పోస్టులు ఖరారయ్యాయి. విశాఖ రేంజ్ జోన్-1లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 50 ఖాళీలు, జోన్-2 ఏలూరు రేంజ్ పరి ధిలోని తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 105 ఖాళీ లు, జోన్-3 గుంటూరు రేంజ్ పరిధిలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో 55 ఖాళీలు, జోన్-4 కర్నూలు రేంజ్ పరిధిలోని చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో 105 ఖాళీలు ప్రకటించింది.
ఇక ఏపీఎస్పిలోని రిజర్వు ఎస్ఐ పోస్టులు (పురుషులు) ఖాళీలు మొత్తం 96 ప్రకటించగా, శ్రీకాకుళం జిల్లా ఎ చ్చెర్ల, రాజమహేంద్రవరం, ప్రకాశం జిల్లా మద్దిపాడు, చిత్తూరు ఈ నాలుగు బెటాలియన్లలో ఒక్కొక్కదానిలో 24 పోస్టుల చొప్పున ఖాళీలు ఉన్నాయి. ఏపీఎస్పి పోలీసు కానిస్టే బుళ్ళ (పురుషులు) ఖాళీలకు సంబంధించి మొత్తం 2520 పోస్టులు ప్రకటించగా ఈ నాలుగు బెటాలియన్లలో ఒక్కొక్కదానిలో 630 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అదేవిధంగా పురుషులు, మహిళలు కలిపి సివిల్ కానిస్టేబుల్ పోస్టులు మొత్తం 3580 ఖాళీలు ప్రకటించగా విశాఖపట్నం సిటీ 187, విశాఖ రూరల్ 159, తూర్పుగోదావరి 298, రాజమండ్రి 83, పశ్చిమగోదావరి 204, కృష్ణా 150, విజయవాడ సిటీ 250, గుం టూరు రూరల్ 300, గుంటూరు అర్బన్ 80, ప్రకాశం జిల్లా 205, నెల్లూరు జిల్లా 160, కర్నూలు జిల్లా 285 చొప్పున ఖాళీలు రిక్రూట్మెంట్ బోర్టు ప్రకటించింది. కాగా ఫిబ్రవరి 19న ఎస్ఐలకు, జనవరి 22న కానిస్టేబుళ్లకు ప్రిలిమినరీ రాత పరీక్ష జరుగనుంది.