అమరావతి, ఆంధ్రప్రభ : ఆక్వా రైతులకు పెనుభారంగా మారిన సీడ్, ఫీడ్ ధరల నియంత్రణఫై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఆక్వా సాధికారత కమిటీ ఏర్పాటు చేసినా హేచరీల యాజమాన్యాలు చెప్పిందే వేదంగా మార్కెట్ నడుస్తోందనీ ధరల భారాన్ని భరించలేక ఆక్వా సాగును విరమించుకుంటున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మంత్రుల బృందంతో కూడిన సాధికారిత కమిటీ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఆక్వా రైతులను కాపాడుకోలేకపోతే ఆ రంగం మనుడకే ప్రమాదం ఏర్పడుతుందనీ దీన్ని దృష్టిలో ఉంచుకుని సీడ్, ఫీడ్ ధరలను హేతుబద్ధంగా నిర్ణయించాలని రైతులు హేచరీలు మందుల కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో సాధికారత కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్ మెంట్ అధారిటీ (అప్సడా) చైర్మన్ వడ్డి రఘురాంతో పాటు ఆక్వా రంగంలో విశేష అనుభమున్న పారిశ్రామికవేత్త రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావులు వివిధ హేచరీ కంపెనీలతో ప్రత్యేకంగా వేశమయ్యారు.
ఈ సమావేశంలో 30 పైసలకే నాణ్యమైన వనామీ రొయ్యల సీడ్ సరఫరా చేసేందుకు హేచరీ యజమానులు హామీ ఇచ్చినట్టు సమాచారం. యుఎస్ మార్కెట్ రెండు రోజుల్లో ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ సీజన్లో ఆక్వా ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందనీ గరిష్టంగా కేజీ ధర రూ 210 చొప్పున కొనుగోలు చసినా ఎగుమతిదారులకు నష్టం వాటిల్లే అవకాశం లేదనీ ఈ నేపథ్యంలో రైతులకు లాభసాటి ధర ఇవ్వాలని వ్యాపారులకు కమిటీ సూచించింది. హేచరీలతో పాటు ఫీడ్ ప్లాంట్ నిర్వాహకులు కూడా రైతులపై భారం తగ్గించాలి..
రైతులతో పాటు హేచరీల ప్రతినిధులు ఎగుమతిదారులు తాము ఎదుర్కొటున్న సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీకి సంబంధిత మంత్రులను కలిసి చర్చించేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని కూడా కమిటీ తరపున వడ్డి రఘురాం, బీదా మస్తాన్ రావులు తెలిపారు. ఇక నుంచి ప్రతి నెలా రైతులతో సమావేశాలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారనీ నాణ్యమైన సీడ్ సరఫరా చేయని హేచరీలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఈ సమావేశంలో స్పష్టం చేసినట్టు తెలిసింది.
బాపట్ల జిల్లాలో ఆక్వా పార్క్
బాపట్ల జిల్లాలోని రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నం మండలం పరిశారిపాలెం తీరప్రాంత గ్రామంలోని సుమారు 280 ఎకరాల్లో ఆక్వా పార్కు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిర్మాణానికి అవసరమైన రూ 185 కోట్ల అంచనా వ్యయానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పరిశారిపాలెం వద్ద ఏర్పాటు చేయనున్న ఆక్వా పార్కు వల్ల ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని తీర ప్రాంతంలో ఆక్వా సాగు విస్తరణ పెరిగే అవకాశముందని అంచనా.
ఆక్వా సాగుకు ప్రధాన అవరోధంగా నాణ్యమైన సీడ్ సమస్య ఆక్వా పార్కు వల్ల తొలగిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. వెనామీ, టైగర రకం రొయ్యలతో పాటు పీతలు, పండుగప్పల సాగుకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉంది. సీడ్ తగినంతగా లభ్యం కాకపోవటంతో తమిళనాడులోని రామేశ్వరం, రామనాధపురంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలకు వెళ్ళి సీడ్ తీసుకురావాల్సి ఉంటుoది.
దీనివల్ల పెట్టుబడి వ్యయం భారీగా పెరిగిపోవటమే కాకుండా నాణ్యమైన సీడ్‌కు గ్యారంటీ లేకుండా పోయింది. ఇపుడు ఆక్వా పార్కు ఏర్పడితే హేచరీలు ప్రాసెసింగ్ యూనిట్లు భారీగా వచ్చే అవకాశం ఉందని అంచనా. దీని వల్ల స్థానికంగానే నాణ్యమైన సీడ్ లభ్యమయ్యే అవకాశం ఉంది. బాపట్లతో పాటు సమీప తీర ప్రాంత జిల్లాల నుంచి ఏటా అనేక దేశాలకు వందల కోట్ల విలువైన ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఆక్వా పార్కు వస్తే సాగు విస్తీర్ణం పెరిగి ఎగుమతుల పరిమాణం రెట్టింపయ్యే అవకాశం ఉందని అంచనా.