- 297 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్
- కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రాయితీ రుణాలు
- ఏపీ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం
ఆంధ్రప్రభ స్మార్ట్, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని పశుసంవర్ధక శాఖలో 297 పోస్టులు భర్తీ చేయాలని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. బుధవారం ఏపీ సచివాలయంలో పశుసంవర్ధక, మత్స్య శాఖల ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను ఏపీపీఎస్‌సీ ద్వారా భర్తీ చేయనున్నారు.
వడ్డీ రాయితీతో రుణాలు..
పశు కిసాన్ క్రెడిట్ కార్డులపై మూడు శాతం వడ్డీ రాయితీతో రూ.2 లక్షల వరకు రుణాలను ఇవ్వాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఏపీలో తీర ప్రాంత అభివృద్ధికి నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. మత్స్యకారుల బోట్లకు ఇంధన రాయితీలతో ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆగిపోయిన మత్స్యకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. ఉపాధి హామీ అనుసంధానంతో పశువుల షెడ్ల నిర్మాణం, గడ్డి పెంపకం మరింత ఎక్కువ మంది లబ్దిదారులకు అందించేందుకు నివేదిక పంపాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.