Thursday, November 21, 2024

తిరుమల తిరుపతిలో ఏప్రిల్‌ 1 నుంచి ఆర్జిత సేవలు పున:ప్రారంభం

తిరుమల, ప్రభన్యూస్‌: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్‌ 1 నుంచి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని టిటిడి నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఈనెల 20వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు తిరుపతిబాలాజి.ఏపి.జివోవి.ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. కొవిడ్‌ -19 నిబంధనలు పాటిస్తూ ఆయా సేవలకు భక్తులను అనుమతిస్తారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజపాద దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో కేటాయిస్తారు. ఈ సేవలను బుక్‌ చేసుకునేందుకు రేపు ఉదయం 10 గంటల నుంచి మార్చి 22వ తేది ఉదయం 10 గంటల వరకు గృహస్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ ఎలక్ట్రానిక్‌ డిప్‌ విధానంలో గృహస్తులకు టికెట్ల కేటాయింపు జరుగుతుంది.
టికెట్లు పొందిన వారి జాబితాను మార్చి 22 ఉదయం 10గంటల తరువాత వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. అదేవిధంగా గృహస్తులకు ఎస్‌ఎమ్‌ఎస్‌, ఈ-మెయిల్‌ ద్వారా తెలియజేస్తారు. టికెట్లు పొందిన గృహస్తులు రెండురోజుల్లోపు టికెట్ల ధర చెల్లించాల్సి ఉంటుంది. కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన భక్తులు నేరుగా బుక్‌ చేసుకోవచ్చు.

పర్వదినాల్లో పలు ఆర్జిత సేవలు రద్దు
ఏప్రిల్‌ 2 ఉగాది సందర్భంగా కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఏప్రిల్‌ 10 న శ్రీరామనవమి సందర్భంగా తోమాల, అర్చన, సహస్ర దీపాలంకార సేవ, వసంతోత్సవాల సేవ సందర్భంగా ఏప్రిల్‌ 14 నుంచి 16వ తేది వరకు కళ్యాణోత్సవం, ఊంజల్‌ సేవ , ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను, ఏప్రిల్‌ 15న నిజపాద దర్శనం సేవలను టీటీడీ రద్దు చేసింది. అదేవిధంగా శ్రీపద్మావతి పరిణయోత్సవాల సందర్భంగా మే 10 నుంచి 12వ తేది వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు, జూన్‌ 14న జ్యేష్టాభిషేకం మూడవ రోజున అష్టదళ పాదపద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, అర్జిత బ్రహ్మోత్సవం సేవలు రద్దయ్యాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు.

కొవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫెకెట్‌ తప్పనిసరి
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కొవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికెట్‌ కాని రెండుడోసులు వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ కాని తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. భక్తులు తమ ఆరోగ్యం, అదేవిధంగా టీటీడీ ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని టీటీడీకి సహకరించాలని కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement