తిరుపతి – శ్రీవారి దర్శనం కోసం కాలినడకన బయలుదేరిన భక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఓ అంబులెన్స్ అదుపుతప్పి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న మహిళా భక్తులపైకి దూసుకువెళ్లింది. దీంతో ఇద్దరు మహిళలు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు భక్తులకు గాయాలయ్యాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురం వద్ద ఈ ఘోరం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుంగనూరు నుంచి కాలినడకన తిరుమలకు వెళుతున్న భక్తులను మదనపల్లె నుంచి తిరుపతికి రోగిని తీసుకెళుతున్న అంబులెన్స్ (108 వాహనం) ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చనిపోయిన శ్రీవారి భక్తులను అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన పెద్ద రెడ్డమ్మ(40), లక్ష్మమ్మ(45)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన ముగ్గురు భక్తులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
- Advertisement -