శ్రీకాకుళం, ( ప్రభ న్యూస్) : ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్న 108 వాహనాన్ని ఇంటర్సిటీ రైలు ఢీకొన్న ఘటన శ్రీకాకుళం జిల్లా పలాసా రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. రాత్రి 7.30 గంటల సమయంలో జరిగిన ఈ సంఘటనలో 108 సిబ్బంది సత్యం, ఆనంద్‌లు అప్రమత్తతతో వ్యవహరిచి, దూకేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాశిబుగ్గ పోలీసులు, రైల్వే పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు కథనం మేరకు హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలకనామ ఎక్స్ ప్రెస్ రైల్లోలో ప్రయాణిస్తున్న కలకత్తాకు చెందిన వ్యక్తికి బి పి పెరిగి అనారోగ్యానికి గురికావడంతో ఫలక్నామ ఎక్స్ ప్రెస్ రైల్వే అధికారులు పలాస రైల్వే స్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో పలాస రైల్వే స్టేషన్ మాస్టర్ 108 సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే సిబ్బంది సత్యం, ఆనంద్ మూడో నంబర్ ప్లాట్ ఫారంనకు 108 వాహనం తో వెళ్ళేందుకు ప్రయాణికులు నడిచే మార్గం (రోలింగ్ పాయింట్ ) ద్వారా ప్రయత్నిస్తుండగా విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ఇంటర్సిటీ ఎక్స్ ప్రెస్ 108 వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది.
ఆ సమయంలో 108 సిబ్బంది సత్యం ఆనంద్ మనోధైర్యాన్ని పెంచుకొని ఒక్కసారిగా వాహనం నుంచి బయటికి దూకేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. రైలు ఢీ కొన్న ఘటనలో 108 వాహనం సుమారు 500 మీటర్లు ఈడ్చుకుపోయింది. కాశిబుగ్గ ఎస్బిఐ శంకర్రావు రైల్వే పోలీసులు, రైల్వే స్టేషన్ మాస్టర్ కె డి పట్నాయక్, ఆర్ పి ఎఫ్ కేకే సామ్యూల్ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదాన్ని పరిశీలించారు. బీపీ పెరిగి అనారోగ్యానికి గురైన వ్యక్తిని వేరే వాహనంలో రిమ్స్‌కు తరలించారు. సుమారు గంటన్నర పాటు ఇంటర్సిటీ ఎక్స్ ప్రెస్ రోలింగ్ పాయింట్ వద్ద నిలిచిపోగా రాత్రి 9.30 గంటలకు పలాస రైల్వే స్టేషన్ లోపలికి వచ్చింది. డీ కొన్న 108 వాహనాన్ని ఫ్లాట్ ఫాం పైకి తీసుకు వచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital