ఉమ్మడి గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉదయం 6 గంటల సమయంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. అద్దంకి నార్కెట్పల్లి రహదారి గీతం హై స్కూల్ బ్రాహ్మణపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
మాల ధారణ ధరించిన ఎనిమిది మంది తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి తిరుగు ప్రయాణమయ్యారు. కారులో 8 మంది ప్రయాణిస్తుండగా బ్రాహ్మణపల్లి వద్దకు రాగానే కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో ఈ ఘోర ఘటన జరిగింది. ఈ ఘటనలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన తుళ్లూరి సురేష్, తుళ్లూరి వనిత, ఉప్పల యోగులు, వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిలో ముగ్గురు ఆంజనేయ స్వామి మాల ధరించి ఉన్నారు. వారిలో మహిళ మృతి చెందింది.
కాగా ముప్పాళ్ళ ఆదిలక్ష్మి, ముప్పాళ్ళ శ్రీను, ముప్పాల ప్రణయ్ కుమార్, కౌసల్య అనే నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరంతా నెల్లూరు జిల్లా కావలి నుంచి తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి తిరిగి సొంత ఊరికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సమాచారం తెలిసిన వెంటనే బంధువులు నెల్లూరు జిల్లా కావలి నుంచి సంఘటన స్థలానికి చేరుకుంటున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. మితిమీరిన వేగంతో నలుగురు ప్రాణాలు కోల్పోవడం స్థానికులను సైతం కంటతడి పెట్టేస్తోంది.