Wednesday, December 25, 2024

AP | సీఐడీ మాజీ డీజీ సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు..

సీఐడీ మాజీ డీజీ ఎన్.సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖ డీజీగా, సీఐడీ హెడ్‌గా పనిచేసిన సంజయ్‌… నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది.

కాగా, విజిలెన్స్ నివేదిక ఆధారంగా సంజయ్‌ను ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. తాజాగా రాష్ట్ర‌ సీఎస్ నీరబ్​ కుమార్ అనుమతితో ఏసీబీ అధికారులు అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎ-1గా సంజయ్, ఎ-2గా సాత్రిక టెక్నాలజీ అండ్ ఇన్ ఫ్రా, ఎ-3గా కృత్‌వ్యాప్‌ టెక్నాలజీ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

అగ్ని-ఎన్‌ఓసి వెబ్‌సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ కోసం ఎన్.సంజయ్ అగ్నిమాపక శాఖలో ఆన్‌లైన్‌లో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు (ఎన్‌ఓసి) జారీ చేయడానికి “సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్‌ఫ్రా”కి 150 ట్యాబ్‌ల సరఫరా కోసం కాంట్రాక్ట్‌ను అప్పగించారు. పనులు జరగకపోయినప్పటికీ ఆ కంపెనీకి రూ.59.93 లక్షల బిల్లులు చెల్లించారు.

మరోవైపు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కాంట్రాక్టును సీఐడీ తరఫున ‘‘కృత్వాప్ టెక్నాలజీస్’’కు అప్పగించి 1.19 కోట్ల రూపాయలు చెల్లించారు. కృత్వాప్ టెక్నాలజీస్ ఎటువంటి సదస్సులు నిర్వహించనప్పటికీ నిధులు దోచేశారు. ఇలా.. ప్రభుత్వ ఖజానాకు సుమారుగా రూ.2 కోట్ల మేర నష్టం వాటిల్లిందని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం నివేదికలు సమర్పించింది.

కాగా, ప్రస్తుతం.. సౌత్రికా టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా, క్రిత్వ్యాప్‌ టెక్నాలజీస్‌ సంస్థల ఖాతాల్లో జమ అయిన డబ్బు ఎవరు విత్‌డ్రా చేశారు? అంతిమంగా ఎవరి వద్దకు చేరిందనే దానిపై ఏసీబీ విచారణ చేయనుంది. క్రిత్వ్యాప్, సౌత్రికా 2 ఒకే చిరునామాలో ఉన్నాయని, క్రిత్వ్యాప్‌ టెక్నాలజీస్‌ డొల్ల కంపెనీ అని విజిలెన్స్‌ తేల్చింది. ఆ డొల్ల కంపెనీ ఏర్పాటు వెనక ఎవరు ఉన్నారు? ఎందుకు ఏర్పాటు చేశారు? నిధులు ఎలా పక్కదారి పట్టించారనేదానిపై ఏసీబీ అధికారులు వివరాలు సేకరించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement