Tuesday, November 19, 2024

ACB Raids – మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్ట్ ….

అగ్రిగోల్డ్ భూముల కేసులో ఎ 1 నిందితుడు
నేటి ఉద‌యం నుంచి జోగి నివాసంలో ఏసీబీ సోదాలు
ప‌లు డాక్యుమెంట్ లు స్వాధీనం
ఇది క‌క్ష సాధింపు చ‌ర్యే న‌న్న జోగి ర‌మేష్
నిరూపిస్తే ఉరి వేసుకుంటా …

(ఇబ్రహీంపట్నం, ప్రభ న్యూస్) – అగ్రి గోల్డ్ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని జోగి నివాసానికి తెల్లవారుజామున నాలుగు గంటలకే ఏసీబీ అధికారులు చేరుకున్నారు. ఐదు గంటలకు ‌నివాసం లోనికి వెళ్లిన 15 మంది ఏసీబీ అధికారులు నాలుగున్నర గంటల పాటు విస్తృత సోదాలు చేశారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న అనంతరం జోగి తనయుడు రాజీవ్ ను అదుపులోకి తీసుకుని గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు.

అంబాపురంలోని అగ్రి గోల్డ్ భూ వ్యవహారంలో రాజీవ్ తో పాటు మరో ఎనిమిది మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. సీఐడీ జప్తులో ఉన్న అగ్రి గోల్డ్ భూములను కొనుగోలు చేసి విక్రయించినట్లు సీఐడీ గుర్తించింది. భూముల లావాదేవీల కేసులో జోగి రాజీవ్ ఏ – 1గా జోగి రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు ఏ – 2గా చేర్చారు. 420, 409, 467, 471, 120 (బీ), 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

- Advertisement -

రాజీవ్ ను అరెస్టు చేసి కారులో ఎక్కిస్తున్న క్రమంలో జోగి అనుచరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరెస్టయిన జోగి రాజీవ్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు.

తప్పు చేశామని నిరూపిస్తే ఉరేసుకుంటాం : జోగి రమేష్
అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల వ్యవహారంలో తాము తప్పు చేశామని నిరూపిస్తే ఉరేసుకుంటామని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. తనయుడు రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి తరలిస్తున్న క్రమంలో ఆయన నివాసం ఎదుట రోడ్డుపై మీడియాతో భావోద్వేగంతో మాట్లాడారు. కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలని, అభంశుభం తెలియని తన కుమారుడిని అన్యాయంగా అరెస్టు చేయడం తగదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం బలహీన వర్గాలను వేధిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement