Saturday, November 23, 2024

ACA | క్రీడాకారులకు అండగా ఏసీఏ..

(ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో) : రాష్ట్రంలో నైపుణ్యం గ‌ల క్రికెట‌ర్స్ ను ప్రోత్స‌హించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వంతో క‌లిసి ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ (ఎసిఏ) ప‌ని చేయ‌బోతుందనీ, అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెట‌ర్స్ ను వెలుగులో తెచ్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వంతో క‌లిసి కృషి చేస్తామని, ద‌స‌రా నుంచి సంక్రాంతి పండుగ మ‌ధ్య‌ రాష్ట్రంలోని ప్ర‌తి పాఠ‌శాల‌లో క్రికెట్ టోర్న‌మెంట్స్ నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు, విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) చెప్పారు.

ఇటీవ‌ల బ‌ధిర ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ మ్యాచ్ లో మోకాల‌కి గాయ‌మైన (డెఫ్ అండ్ డ‌మ్ ) రావూరి య‌శ్వంత్ కి డాక్ట‌ర్ భార్గ‌వ్ రామ్ అత్యాధునిక వైద్యంతో ఆప‌రేష‌న్ విజ‌య‌వంతం చేశారు. ఆప‌రేష‌న్ జ‌రిగిన నాలుగు నెలల్లో రావూరి య‌శ్వంత్ 140 కిలోమీట‌ర్ల వేగంతో బౌలింగ్ చేసి శ్రీన‌గ‌ర్ లో జ‌రిగిన మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు.

ఈ సంద‌ర్బంగా బ‌ధిర క్రికెట‌ర్ రావూరి య‌శ్వంత్ కి డాక్ట‌ర్ భార్గ‌వ్ రామ్, డాక్ట‌ర్ యు.వి.ర‌మ‌ణ ది ట్ర‌స్ట్ జాయింట్ సెంట‌ర్ హాస్ప‌ట‌ల్ లో గురువారం స‌న్మాన కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. య‌శ్వంత్ కి ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ శాలువాతో ఘ‌నంగా స‌త్క‌రించారు.

స‌న్మానం అనంత‌రం ఎం.పి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ… గాయ‌ప‌డిన రావూరి య‌శ్వంత్ కి విజ‌య‌వంతంగా ఆప‌రేష‌న్ చేయ‌ట‌మే కాకుండా మాన‌సిక సైర్థ్యం కోల్పోకుండా తిరిగి త్వ‌ర‌గా కోలుకునేందుకు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకున్న డాక్ట‌ర్ భార్గ‌వ్ రామ్ కి అభినంద‌న‌లు తెలిపారు.

బ‌ధిర క్రికెట‌ర్ య‌శ్వంత్ క‌ఠోర‌దీక్ష‌, ప‌ట్టుద‌ల ను కొనియాడారు. డెఫ్ అండ్ డ‌మ్ క్రీడాకారుల‌ను ఆదుకునే విష‌యంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ను క‌లిసి వారికి ఉప‌యోగ ప‌డే విధంగా విధివిధానాలు త‌యారు చేస్తామ‌న్నారు.

- Advertisement -

ఇటీవ‌ల డెఫ్ అండ్ డ‌మ్ క్రికెట్ ఆర్గ‌నైజేష‌న్ స‌భ్యులు త‌న‌ని గుంటూరులో క‌ల‌వ‌టం జ‌రిగింద‌న్నారు. ఆ స‌మ‌యంలో వారికి ఎసిఏ త‌రుఫున కావాల్సిన మౌలిక స‌దుపాయాల‌తో పాటు ఆర్థిక సాయం కూడా అందిస్తామ‌ని హామీ ఇచ్చిన‌ట్లు చెప్పారు.

ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ త‌రుఫున రావూరి య‌శ్వంత్ కి ఎటువంటి సాయ‌మైన త‌ప్ప‌కుండా అందజేస్తామ‌న్నారు. త‌న‌కి కావాల్సిన మౌలిక స‌దుపాయాలు కూడా క‌ల్పిస్తామ‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వంలో గాయ‌ప‌డిన క్రీడాకారుల‌కు అండ‌గా నిల‌బ‌డేందుకు ఒక స్కీమ్ వుందని…ఆ స్కీమ్ ద్వారా ఆర్ధికంగా ఆదుకునే విధంగా కృషి చేస్తామ‌న్నారు.

విక‌లాంగులు క్రీడ‌ల్లో రాణించేందుకు ఏ సాయ‌మైనా చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం తోడుగా వుంటుంద‌న్నారు. గ‌తంలో ఇండియ‌న్ క్రికెట్ టీమ్ త‌రుఫున‌ ఢిల్లీ, ముంబై, క‌ల‌క‌త్తా ప్లేయ‌ర్స్ మాత్ర‌మే ఆడేవార‌ని…. బిసిసిఐ విస్త‌రించిన త‌ర్వాత గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్ర‌తిభ గ‌ల‌ క్రికెట‌ర్స్ వెలుగులోకి వ‌స్తున్నారన్నారు.

ఇంకా ప్ర‌తిభ గ‌ల గ్రామీణ‌ క్రీడాకారుల‌కు చేయూత అందించేందుకు బిసిసిఐ చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు వివ‌రించారు. అందులో భాగంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ త‌రుఫున గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెట‌ర్స్ కి అండ‌గా నిల‌బ‌డేందుకు ప్ర‌ణాళిక త‌యారు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

పాఠ‌శాల‌ల్లో క్రికెట్ టోర్న‌మెంట్స్ ….

రాష్ట్రంలో నేష‌న‌ల్ గేమ్స్ నిర్వ‌హించేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కృషి చేస్తున్నారు. ఈ నేప‌ధ్యంలో ఇప్ప‌టి నుంచే క్రీడాకారుల‌ను ప్రోత్స‌హిస్తే రాష్ట్రంలోని క్రీడాకారుల ప్ర‌తిభ ప్ర‌పంచానికి తెలిసే అవ‌కాశం వుంటుంద‌న్నారు. అలాగే రాష్ట్రంలోని ప్ర‌తి పాఠ‌శాల‌లో క్రీడ‌ల‌ను పెంపొందించే విధంగా రాష్ట్ర ప్ర‌భుత్వం కృషి చేయ‌నుంద‌ని స్ప‌ష్టం చేశారు.

ప్ర‌తి పాఠ‌శాల‌లో క్రికెట్ టోర్న‌మెంట్స్ నిర్వ‌హించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వంతో క‌లిసి ఏసిఎ కృషి చేయ‌బోతుంద‌ని తెలిపారు. ఎసిఏ సేవ‌లు విజ‌య‌వాడ‌, వైజాగ్ ప్రాంతాల‌తో పాటు గ్రామీణ ప్రాంతాల‌కు కూడా విస్త‌రించి ప్ర‌తిభ గ‌ల క్రికెట్ క్రీడాకారుల‌కి అండ‌గా నిల‌బ‌డ‌తామ‌ని చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో కార్పొరేట‌ర్ చెన్నుపాటి ఉషారాణి, టిడిపి రాష్ట్ర కార్య‌ద‌ర్శి చెన్నుపాటి గాంధీ ల‌తో పాటు హాస్ప‌ట‌ల్ సిబ్బంది, ఇత‌ర నాయ‌కులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement