Friday, November 22, 2024

AB Venkateswararao – ఉద‌యం బాధ్య‌త‌లు…సాయంత్రం ప‌ద‌వీ విర‌మ‌ణ‌…

ఏక్ దిన్ కా సుల్తాన్‌గా ఉద్యోగ‌ నిర్వ‌హణ‌
ఏపీ పోలీసు ఆఫీసర్​కు ఇదో పెద్ద‌ ఓదార్పు
ఉద్యోగం ఇవ్వాల్సిందేనని హైకోర్టు ఆదేశం
ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్
ఉద‌యం బాధ్య‌త‌లు స్వీక‌ర‌ణ‌
సాయంత్రమే ప‌ద‌వీ విర‌మ‌ణ‌
అయిదేళ్లపాటు పరోక్ష జైలు శిక్ష అనుభవం
కడకు న్యాయమే గెలిచిందన్న ఉద్యోగులు
హ్యాట్సాఫ్​ ఏబీవీ అంటూ అభినందనలు

- Advertisement -

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: ఒకటా రెండా.. ఏకంగా అయిదేళ్లు ప్రభుత్వ నిర్బంధం.. పరోక్ష జైలు శిక్షను అనుభవించిన ఫీలింగ్‌. త్రిశంకు స్వర్గంలో తల్లడిల్లిన ఏపీ పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఏక్ దిన్ కా సుల్తాన్ త‌ర‌హాలో ఆయ‌న శుక్ర‌వారం బాధ్యతలను స్వీకరించే అకాశం దక్కింది. అధికార పార్టీ వేధింపులపై అయిదేళ్లు.. వివిధ రూపాల్లో అలుపెరగని న్యాయపోరాటం చేసిన ఏబీ వెంకటేశ్వరరావు నేటి ఉద‌యం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా బాధ్యతలు స్వీక‌రించారు.. ఇక సాయంత్ర‌మే ఆయ‌న‌ ఉద్యోగ విరమణ చేశారు…దీనిపై ప‌లువురు స్పందిస్తూ, ఎట్టకేలకు న్యాయం గెలిచిందబ్బా.. కుంగిపోకూ.. అంటూ ఏబీవీని అభిమానులు, అధికారులు ఓదార్పు వ‌చ‌నాలు పలుకుతున్నారు.

అయిదేళ్ల పోరాట ఫలితం..

2019లో అధికారంలోకి వచ్చీ రాగానే వైసీపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇక్కడి నుంచే ఏబీ వెంకటేశ్వరరావు కష్టకాలం ఆరంభమైంది. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఏబీ వెంకటేశ్వరరావు అయిదేళ్లుగా న్యాయపోరాటం చేసి.. కడకు విజయం సాధించారు. ప్రభుత్వ అనుచిత చర్యలకు వ్యతిరేకంగా తొలుత క్యాట్‌ను ఆశ్రయించారు. సస్పెన్షన్ ఎత్తి వేయాలని ప్రభుత్వానికి క్యాట్ సూచించింది. దీనిపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. క్యాట్ ఉత్తర్వులపై జోక్యం చేసుకోబోమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అలా అయిదేళ్లుగా ఏబీ వెంకటేశ్వరరావు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. ఆయన పోరాటం ఫలించి.. ఉద్యోగ‌ విరమణ రోజు విధుల్లో చేరి.. తాను ఎలాంటి తప్పు చేయలేదనే ఆత్మ సంతృప్తితో.. పోలీసు శాఖకు వీడ్కోలు ప‌లికారు.

అసలు కథేంటీ?

పోలీసు శాఖలో నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం చర్యలకు ఆదేశిచింది. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజునే ప్ర‌భుత్వం ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేసింది. 2014 , 2019లో నిఘా పరికరాల కోసం తన కుమారుడికి చెందిన సంస్థకు ఏబీ వెంకటేశ్వరరావు కాంట్రాక్ట్‌ ఇప్పించారనే ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వంలో కొనుగోలు చేసిన అంశంపై ఉన్నతాధికారుల అభ్యంతరాలు చెప్పినా వినిపించుకోలేదు. నిఘా పరికరాల వ్యవహారం, ఇజ్రాయెల్‌కు రహస్యాలు చేరవేశారని కేసు నమోదు చేశారు. ఆ కారణాలతో ఏబీవీని విధుల నుంచి తప్పించారు.

రెండు సార్లు సస్పెన్షన్ ..

ప్రభుత్వం తనను సప్పెండ్‌ చేయడంపై ఏబీవీ కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘంగా న్యాయపోరాటం చేశారు. క్యాట్‌ తర్వాత కేంద్ర హోం శాఖలో ఊరట దక్కలేదు. తర్వాత ఏబీ వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో అనుకూల తీర్పు వచ్చింది. 2022 జూన్‌ 15న ఊరట లభించింది. కోర్టు జోక్యంతో ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌గా ఏబీవీ బాధ్యతలు చేపట్టారు. 14 రోజుల తర్వాత జూన్‌ 29న మళ్లీ సస్పెండ్‌ చేశారు. ఆ తర్వాత న్యాయ పోరాటం చేశారు. ఏపీ ప్రభుత్వం తనను సస్పెండ్‌ చేస్తూ జారీచేసిన ఉత్తర్వులపై క్యాట్‌ను ఆశ్రయించారు. ఒకే కారణంతో రెండు సార్లు సస్పెండ్‌ చేయడాన్ని సవాల్‌ చేశారు. దీనిపై విచారణ జరిపిన క్యాట్‌ కీలక ఆదేశాలు ఇచ్చింది. సస్పెన్షన్‌ చెల్లదని, సస్పెన్షన్ ఎత్తివేస్తూ బాధ్యతలు అప్పగించాలని, వేతన బకాయిలు చెల్లించాలని క్యాట్‌ ఆదేశించింది. దీంతో ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. ఏబీవీకి పోస్ట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

ఏక్ దిన్ కా చాన్స్…

హైకోర్ట్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం సీనియర్పోలీసుఅధికారిఏబీ వెంకటేశ్వర రావుపై ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేసింది. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు మొదటిసారి సస్పెన్షన్ ఎత్తివేసి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. అప్పుడు కూడా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే పోస్టింగ్ ఇచ్చింది. బాధ్యతలు స్వీకరించిన ఏబీ వెంకటేశ్వరరావు శుక్రవారం సాయంత్రం ఉద్యోగ విరమణ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement