అమరావతి, ఆంధ్రప్రభ : ఓటరు కార్డుకు ఆధార్ కార్డు లింకు చేయడం సమంజసం కాదని సిపి ఎం ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటరు కార్డుకు ఆధార్ లింకు, కొత్త ఓటర్ల నమోదు, లేని ఓటర్లను లిస్టు నుండి తొలగింపు తదితర అంశాలపై వివిధ రాజకీయ పార్టీలతో బుధవారం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నిర్వహించిన సమావేశంలో ఈమేరకు అభిప్రాయాలు వెల్లడించారు. ఓటర్ కార్డుకు ఆధార్ కార్డు లింకు చేయడాన్ని సిపి ఎం మొదటి నుండి వ్యతిరేకిస్తున్నదని, ఆధార్ కార్డు విషయం సుప్రీం కోర్టు విచారణలో ఉన్నందున ప్రస్తుతం లింక్ చేయరాదని ఆ పార్టీ ప్రతినిధులు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు తెలియజేశారు.
ఆధారం ఇవ్వడం అనేది స్వచ్ఛందం అని చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో వినియోగించి తప్పనిసరి చేస్తున్నారనీ, రాష్ట్ర స్థాయిలో పూర్తిగా చర్చించకుండానే క్రింది స్థాయికి తీసుకువెళ్ళి అమలుకు పూనుకోవడం సరైంది కాదని కాదన్నారు. ఓటరు గుర్తింపు కోసం ప్రస్తుతం అమల్లోనున్న 11 రకాల గుర్తింపు కార్డుల పద్ధతిని కొనసాగించాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ- సభ్యులు జె.జయరాం ఈ సమావేశానికి హాజరయ్యారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.