Saturday, November 23, 2024

AP | రాష్ట్రంలోని పథకాలకు ఆధార్‌ తప్పనిసరి.. ప్రభుత్వం కీలక నిర్ణయం

అమరావతి, ఆంధ్రప్రభ “ రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించడానికి ఆధార్‌ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. ఆధార్‌ చట్టంలోని నిబంధనలను సవరించింది. పథకాల అమలులో పారదర్శకత కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందించే ఆర్థిక ప్రయోజనాలు, రాయితీలు, సేవలు పొందడానికి ఆధార్‌ కచ్చితంగా అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఆధార్‌ లేని వారిని గుర్తించి దరఖాస్తులు తీసుకోవాలని సూచించారు.

అప్పటి వరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వారికి ప్రభుత్వ పథకాలు అందించాల్సి ఉంటుందని తెలిపారు. ఆధార్‌ లేదన్న కారణాన్ని చూపి లబ్ధిదారులకు ఇవ్వాల్సిన పథకాలు తిరస్కరించకూడదు. దరఖాస్తు చేసుకున్న 3 నెలల్లో ఆధార్‌ నంబరు కేటాయించి, వారికి అందే పథకాలకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం తెలిపింది. మరోవైపు ప్రభుత్వం జగనన్న సురక్ష పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఈకార్యక్రమం ద్వారా 11 రకాల సర్టిఫికేట్లను ఎటువంటి సర్వీసు రుసుము లేకుండా అందిస్తున్నారు. రాష్ట్రంలోని ఏ ఒక్కరూ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకానికి అర్హత ఉండి తీసుకోలేకపోయామన్నది రాకుండా ఉండేందుకు ఈకార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో కూడా ఆధార్‌ తప్పనిసరే. ఈనేపథ్యంలో ఇప్పటి వరకూ ఆధార్‌ లేనివారికి ప్రత్యామ్నాయ పద్దతుల్లో సర్టిఫికేట్లు జారీ చేయాలని, మూడు నెలల్లో వారికి ఆధార్‌ వచ్చేలా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement