ఏపీలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తను అతని భార్య నడిరోడ్డుపై ఉరివేసి చంపింది. బాపట్ల జిల్లాలో ఈ దారుణమైన ఘటన జరిగింది. పట్టపగలే భర్తను భార్య కొట్టి, ఉరేసి చంపిన ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమరేందర్ అరుణ దంపతులు కొంతకాలంగా నిజాంపట్నం మండలంలోని కొత్తపాలెంలో నివాసం ఉంటున్నారు. గురువారం, ఇద్దరు సడెన్‌గా రోడ్డు మీద చేరుకుని గొడవ మొదలుపెట్టారు. మాటామాటా పెరిగి పరస్పరం కొట్టుకున్నారు.
ఈ సమయంలో భార్య వివేకాన్ని కోల్పోయి, భర్త అమరేందర్ తలపై కర్రతో గట్టిగా కొట్టింది. దీంతో అమరేందర్ కిందపడిపోయాడు. అప్పటికే అమరేందర్‌కి గాయాలు అయినా సరే.. అరుణ అక్కడితో ఆగకుండా అమరేందర్ గొంతుకు తాడుతో ఉరేసింది. ఈ ఘటనలో అమరేందర్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.
గ్రామస్తులు ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం అందించడంతో.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అరుణను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను అరెస్ట్ చేసి, అమరేందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మద్యానికి బానిసైన అమరేందర్.. ఎప్పటిలానే ఈరోజు కూడా తాగి భార్య అరుణతో గొడవపడగా ఈ దారుణం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.