- జగన్ బర్త్ డే బహిరంగ వేడుకలకు అనుమతి నో
- శాంతి భద్రతల సమస్య అంటున్న పోలీసు శాఖ
- అన్యాయం అంటున్న వై కాపా.. అంతేగా అంటున్న తెదేపా
కుప్పం, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : అట్టు పెట్టినమ్మకు అట్టున్నర పెట్టమన్న సామెతను కుప్పం నియోజకవర్గంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు పాటిస్తున్నాయని స్పష్టం అవుతోంది. గత అయిదేళ్ల మధ్య కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులు అధికారికంగా అమలు చేసిన విధానాలే ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వర్గాలు అమలు చేస్తున్నాయి. ఎప్పటిలాగే ఈరోజు తమ అధినేత జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పలుచోట్ల జరుపుకోడానికి అనుమతి కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన విజ్ఞప్తికి అధికారులు కుదరదని స్పష్టం చేశారు. అందుకు నియోజకవర్గంలో ప్రస్తుత ముఖ్యమంత్రి సతీమణి పర్యటిస్తున్న తరుణంలో శాంతి భద్రతల సమస్య ఏర్పడవచ్చనే కారణాన్ని చూపించారు. కావలిస్తే బహిరంగ ప్రదేశాల్లో కాకుండా కార్యాలయాల్లోనే జరుపుకోవచ్చునని సూచించారు.
ఈ అంశంపై సహజంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు రగిలిపోతున్నా మౌలిక కారణాలు మాత్రం గత అయిదేళ్ల మధ్యకాలంలోనే కనిపిస్తాయి. 2019-2024 మధ్యకాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పై ఆధిపత్యం సాధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాల ఫలితంగా నియోజకవర్గంలో జరిగిన అన్ని స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారే విజయం సాధించారు. ఆ క్రమంలోనే నియోజకవర్గం పరిధిలోని ప్రతి మండలంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం మద్దతుదారులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. రాజకీయపరంగా అది తప్పుకాకున్నా చేసిన ప్రయత్నాలు పలుమార్లు అదుపు తప్పిన ఉదంతాలు ఎక్కువగానే ఉన్నాయి.
అందులో భాగంగానే ఒకసారి తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుప్పం లో చేపట్టిన ర్యాలీ కి పోటీగా వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు ఉద్రిక్తత కు దారితీసాయి. ఒక దశలో చంద్రబాబు నడిరోడ్డుపై కూర్చుని నిరసన తెలపాల్సివచ్చింది. పలుసార్లు తెలుగుదేశం పార్టీ చేపట్టిన కార్యక్రమాలకు అధికారిక అనుమతులు ఇవ్వకపోవడం వెనుక వై ఎస్సార్ కాంగ్రెస్ పెద్దలున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. అవన్నీ ఆరోపణలే అని వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కొట్టివేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రాధికారం చేపట్టిన తరువాత ఆ పార్టీ వర్గాల హవా మొదలైంది. ఆ వర్గాల కృషి ఫలితంగా వై ఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన కుప్పం మున్సిపల్ చైర్మన్ తో సహా పలువురు కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. గత అయిదేళ్లలో తెలుగుదేశం పార్టీ కి దూరమైన వారంతా తిరిగి స్వంత గూటికి చేరుకోవడం ఊపందుకుంది. కుప్పంలో వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా మూత పడే పరిస్థితి ఏర్పడింది.
తాజాగా తమ అధినేత జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఎప్పటిలాగే నాలుగు చోట్ల జరుపుకోడానికి అనుమతి కోరుతూ ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్, శాసనమండలి సభ్యుడు భరత్ కుప్పం ప్రాంత డి ఎస్ పి కి రెండురోజుల క్రితం వినతిపత్రం సమర్పించారు. అందుకు అనుమతిని నిరాకరిస్తున్నట్టు డి ఎస్ పి లేఖ రాసారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నందున తెలుగుదేశం, వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీల వర్గీయుల మధ్య గొడవలు రేగే అవకాశం ఉన్నందున శాంతి భద్రతల పరిరక్షణ అంశాన్ని కారణం గా పేర్కొన్నారు. కావాలంటే పార్టీ కార్యాలయాల్లోనే వేడుకలు జరుపుకోవచ్చునని సూచించారు. సహజంగానే వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గతంలో తెలుగుదేశం పార్టీ వర్గాలు చేసినట్టే ఇది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఉన్న హక్కులను కాలరాసే అధికార దుర్వినియోగమే అని ఆరోపించారు. అన్నిటినీ గమనిస్తున్న కుప్పం ప్రాంత ప్రజలు మాత్రం నీవునేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్టు ఉన్నాదని, అప్పుడు వాళ్లు చేసినట్టే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారని అంటున్నారు.