వైభవంగా చందనోత్సవం
భారీగా తరలివచ్చిన భక్త జనం
తొలి దర్శనం చేసుకున్న గజపతిరాజు
గోవింద నామాల స్మరణతో మారుమోగుతున్న గిరులు
భక్తులంతా వేయికళ్లతో ఎదురుచూసిన సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనం సాక్షాత్కారమైంది. వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలంలో చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేకువజామున ఒంటి గంటకు సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి దేహంపై ఉన్న చందనాన్ని తొలగించి నిజరూపంలోకి తీసుకొచ్చారు.
ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత వేకువజామున 2.30 గంటల నుంచి సాధారణ భక్తులకు అవకాశం కల్పించారు. అప్పన్న స్వామిని నిజరూప దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో వేకువజాము నుంచే సింహగిరిపై భక్తులు బారులు తీరారు. గోవింద నామాలతో సింహాచల పుణ్యక్షేత్రం మారుమోగుతోంది.