ఘోర రోడ్డుప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి జిల్లా పాడేరు సమీపంలో చోటుచేసుకుంది. కారు ఘాట్ రోడ్డుపై వెళుతుండగా ఒక్కసారిగా అదుపతప్పి లోయలో దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో భార్యాభర్తలతో సహా ముగ్గురు మృత్యువాత పడ్డారు. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం కిలాగాడ గ్రామానికి చెందిన చెండా సుబ్బారావు ఎల్‌ఐసీలో అడిషనల్ డివిజల్ అధికారిగా పనిచేస్తున్నారు. ఉద్యోగ నిమిత్తం భార్య మహేశ్వరి, పిల్లలతో కలిసి విశాఖపట్నంలో నివసిస్తున్నారు. అయితే గంగదేవత జాతర ఉండటంతో దంపతులిద్దరు సమీప బంధువు పూర్ణచంద్రారావుతో కలిసి స్వగ్రామానికి వెళ్లారు.
కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులతో కలిసి ఆనందంగా జాతర జరుపుకున్నారు. జాతర ముగియడంతో వీరంతా గత రాత్రి విశాఖపట్నంకు తిరుగు పయనమయ్యారు. అయితే పాడేరు ఘాట్ రోడ్డులో వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వంట్లమామిడి సమీపంలోని కోమలమ్మ పనుకు దగ్గర గల మలుపులో కారు అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొట్టి లోయలోకి పడిపోయింది. కారు డ్రైవర్ ఉమామహేశ్వరరావు, చెండా మహేశ్వరి అక్కడికక్కడే మృతిచెందగా.. సుబ్బారావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన పూర్ణచంద్రారావు పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. దంపతుల మృతితో వారి స్వగ్రామమైన కిలాగడలో విషాదఛాయలు అలుముకున్నాయి.