విజయవాడ (ప్రభ న్యూస్): ఎటువంటి కారణం లేకుండా విద్యార్థులను విచక్షణారహితంగా కర్రలతో, పైపులతో దండిస్తున్నారని ఆరోపణల నేపథ్యంలో ఒక ఉపాధ్యాయుడిపై వేటు పడింది. విజయవాడ నగరంలోని మాచవరంలో ఉన్న టీఎంఆర్సి మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న టి. కుమార్ రెడ్డి పాఠశాల విద్యార్థులను ఎటువంటి కారణం లేకుండా విచక్షణ రహితంగా కర్రలతో, పైపులతో కొడుతున్నాడని.. విద్యార్థులను గంటలు తరబడి మోకాళ్ళపై నించోబెట్టి శిక్షిస్తున్నాడని ఆరోపణలు వెళ్లివేత్తాయి.
ఈ ఆరోపణల నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి సి వి రేణుక పూర్తిస్థాయి విచారణ జరిపించారు. ఈ విచారణలో పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆయా కమిటీ మెంబర్లు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్, ఉపాధ్యాయులు తదితరుల స్టేట్మెంట్లను రికార్డు చేసిన అనంతరం ఆరోపణలు నిజమేనని తేల్చారు. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారిని రేణుక సిఫార్సు మేరకు పాఠశాల విద్య సంయుక్త సంచాలకులు ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారని జిల్లా విద్యాశాఖ అధికారిని రేణుక తెలిపారు.