(ఆంధ్రప్రభ, విజయవాడ) : నవ ఆవిష్కరణలకు పాలీటెక్ ఫెస్ట్ ఓ గొప్ప వేదిక అని.. యువ మెదళ్ల నుంచి వచ్చిన కొత్త ఆలోచనలకు ప్రతిరూపంగా విద్యార్థుల ప్రాజెక్టులు ఉన్నాయని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ జేడీ వి.పద్మారావు అన్నారు. సోమవారం విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రీజనల్ పాలీటెక్ ఫెస్ట్-2024ను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ జేడీ వి.పద్మారావు, ఎస్‌బీటీఈటీ కార్యదర్శి జీవీ రామచంద్రరావు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జేడీ పద్మారావు మాట్లాడుతూ… రీజనల్ పాలీటెక్ ఫెస్ట్‌లో ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలోని అయిదు ప్రభుత్వ, 10 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు 129 ప్రాజెక్టులను ప్రదర్శనకు ఉంచినట్లు తెలిపారు. కళాశాలలో చదువుకుంటున్న సమయంలోనే విద్యార్థులు మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా కొత్త ఆలోచనలకు ఆచరణ రూపమిచ్చి ప్రాజెక్టులను రూపొందించడం ఆనందించదగ్గ విషయమని పేర్కొన్నారు. రియల్‌టైమ్ టెక్నాలజీస్‌కు సంబంధించి ప్రాక్టికల్ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఇలాంటి ఫెస్ట్‌లు దోహదం చేస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక 8వ డివిజన్ కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఎం.విజయసారథి, వివిధ విభాగాధిపతులు, వివిధ పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపల్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.