Friday, November 22, 2024

రాష్ట్ర ఆర్థిక పరిస్ధితిపై నూతన అధ్యయనం జరగాలి.. పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఆర్దిక పరిస్ధితిపై లోతైన అధ్యయనం జరగాలని శ్రీలంక బాటలోనే రాష్ట్రం పయనిస్తునట్లుగా స్పష్టమవుతున్నదని పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ వ్యాఖ్యానించారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పది రాష్ట్రాలలో ఆర్ధిక పరిస్దితిపై కేంద్రం చేసిన ప్రకటన రాష్ట్రంలో తమ వాదనను బలపరుస్తున్నదని తెలిపారు. శ్రీలంక ఆర్దిక సంక్షోభ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఆర్దిక పరిస్ధితులపై అంచనాలు వేయాలని కేంద్ర ఆర్ధిక శాఖ ఆర్బీఐను ఆదేశించిందని తెలిపారు. సమగ్ర అధ్యయనం తర్వాత కేంద్ర ఆర్దిక శాఖ నివేదికలు ఇచ్చిందని ఆర్దిక సంక్షోభం దిశగా ఆంధ్రప్రదేశ్‌ సాగుతున్నట్లుగా స్పష్టమైందన్నారు.

దాదాపు 10 నివేదికలు వస్తే వాట న్నిటిలో ఒకటి ,రెండు స్ధానాలలోనే రాష్ట్రం ఉందని పయ్యావుల కేశవ్‌ వెల్లడించారు. రూ.50 వేల కోట్ల అప్పులకు సంబంధించిన పద్దులు ఇంతవరకు కేంద్రానికి అందలేదని తెలిపారు. దేశంలోనే ఏ రాష్ట్రానికి ఇవ్వని క్వాలిఫైడ్‌ సర్టిఫికెట్‌ ఏపికి కాగ్‌ ఇచ్చిందని వెల్లడించారు. శ్రీలంక కన్నా నాలుగురెట్ల అప్పు రాష్ట్రం ఎక్కువగా చేసిందని తెలిపారు. సంక్షేమం ముసుగులో ఆర్ధిక అరాచకానికి పాల్పడుతుందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో వివిధ శాఖల ద్వారా మరిన్ని అప్పులు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఆర్దిక మంత్రి బుగ్గన ఎక్కడికి పిలిచిన వస్తామని పయ్యావుల కేశవ్‌ సవాల్‌ విసిరారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గిపోతుంటే అప్పులు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయని తెలిపారు. ఈ ఆర్దిక సంక్షోభం వివరాలను ప్రజల ముందుంచుతామని పయ్యావుల కేశవ్‌ వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement