చిత్తూరు : తవణంపల్లె మండలం మాధవరం గ్రామ పరిసర ప్రాంతాల్లో రైతుల పంట పొలాలను ఒంటరి ఏనుగు ద్వంసం చేసింది. దీంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న చిత్తూరు పశ్చిమ అటవీ క్షేత్ర అధికారి సుభాష్ స్పందించి.. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారు. మాధవరం బీట్ ఆఫీసర్ కుసుమ, సరకల్లు గ్రామ బీట్ ఆఫీసర్ రామచంద్రలు మాధవరం గ్రామ పరిసర ప్రాంతాలకు చేరుకుని ధ్వంసమైన పంట పొలాలను పరిశీలించారు. పంటనష్టాన్ని అంచనా వేసి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. ఈ సందర్భంగా ఒంటరి ఏనుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు.
అనంతరం చిత్తూరు పశ్చిమ అటవీ క్షేత్ర అధికారి సుభాష్ మాట్లాడుతూ… గతకొంత కాలంగా ఏనుగుల దాడులు తగ్గుముఖం పట్టాయని, అయితే ఇటీవలే 15 ఏనుగుల గుంపు జగమర్ల, తుంబపాళ్యం, మాధవరం, ప్రాంతాల్లో సంచరిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం పెద్ద ఉప్పరపల్లి అటవీ ప్రాంతాల్లో ఉన్నట్లు తెలిసిందన్నారు. ఏ సమయంలోనైనా ఐరాల అటవీ ప్రాంతాల వైపు వచ్చే అవకాశాలున్నాయని, ఇందుకోసం చుక్కవారిపల్లె, దివిటీవారిపల్లి తదితర ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించి అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. ఏనుగుల పట్ల సమాచారం అందిన వెంటనే అధికారులకు తెలియజేయాలని ఆయన కోరారు.