అమరావతి, ఆంధ్రప్రభ: ఆర్థికంగా బలహీనంగా ఉన్న విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం, చదువుకోవాలనుకునే ఆర్థిక కొరత కారణంగా చదవడం సాధ్యం కానటువంటి వారికి ఆర్ధిక చేయూతనిచ్చి ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యం తో జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు. దీని ద్వారా రాష్ట్రంలో ఉన్నత విద్యను ప్రోత్సాహం లభించి యువకులు తదుపరి విద్యలో చొచ్చుకుపోతున్నారు.
కుటుంబంపై వివిధ ఆర్థిక భారం కారణంగా ఫీజులు చెల్లించలేని విద్యార్థులందరికీ స్కాలర్‌షిప్‌లు చాలా ముఖ్యమైనవి. కనుక ఈ పథకం కింద ఏటా నాలుగు విడతలుగా నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది. పూర్వం ఉన్న ఫీజు రీయంబెర్స్‌మెంటును ప్రక్షాళన చేశారు. రీయంబర్స్‌మెంట్ స్థానంలో జగనన్న విద్యా దీవెన పేరిట రీయంబర్స్‌మెంట్ ఫండ్ (ఆర్‌టిఎఫ్), స్కాలర్‌షిప్‌ల స్థానంలో జగనన్న వసతి దీవెన పేరిట మెయింటెనెన్స్ ఫండ్ (ఎమ్‌టిఎఫ్) పథకాలను ప్రవేశపెట్టారు.
ఉన్నత విద్యను అభ్యసిస్తూ ప్రభుత్వం నిర్ధేశించిన కుటుంబ ఆదాయానికి లోబడి ఉన్న పేద విద్యార్ధులకు చదువు పూర్తయ్యే వరకు ఫీజు మొత్తం చెల్లించడంతో పాటు ప్రతి నెలా అయ్యే హాస్టల్ ఫీజు, భోజనం తదితర ఖర్చుల నిమిత్తం వసతి దీవెన పేరిట ఆర్ధిక చేయూతనిస్తుంది. ఈ పథకం కింద, రాష్ట్రంలోని సుమారు 14 లక్షల మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందుకుంటున్నారు.
ఉన్నత విద్యలో బిటెక్, డిప్లొమా, భీపార్మశీ, ఎంఫార్మశీ, పాలిటెక్నిక్, ఎంసీఏ, ఎంబీఏ, ఎంటెక్ వంటి ఆయా కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు ట్యూషన్ ఫీజు మరియు హాస్టల్ ఫీజు నిమిత్తం జగనన్న వసతి దీవెన అందిస్తున్నారు. డిగ్రీ, మెడిసిన్, ఇంజనీరింగ్ మొదలైనవి చదివే విద్యార్థులకు సంవత్సరానికి రూ 20,000 ఇస్తారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ15,000, ఐటీఐ విద్యార్థులకు రూ 10,000 చప్పున సంవత్సరానికి ఒకసారి అందజేస్తారు. సంక్షేమ హాస్టళ్లలో చదివే విద్యార్థులకు మెస్ ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటు-ంది.
4వ విడత ఈ నెల 28న..
ఈ నెల 28వ తేదీన 4వ విడత జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ యేడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి, రాష్ట్ర ప్రభుత్వం రూ. 680.44 కోట్లను 8, 44,336 మంది విద్యార్థుల తల్లులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. తాజాతా 4వ విడత నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు పథకంలో నూతన మార్పులు తీసుకువస్తూ సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు.
జిల్లా కలెక్టర్‌లు లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్స్ (ఎల్‌డిఎమ్), బ్యాంకు కో ఆర్డినేటర్లతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి కొత్త నిబంధనలు బ్యాంకు మేనేజర్లకు తెలియజేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి జిల్లా వెల్ఫేర్ అధికారి కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తూ బ్యాంకు అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ఒకో బ్రాంచ్‌లో రోజుకు 100 మంది చప్పున కొత్త ఉమ్మడి బాంకు ఖాతాలు తెరిచేలా జిల్లా కలెక్టర్లు ప్రణాళిక రూపొందించి అమలు జరిగేలా బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.
విద్యార్ధి, తల్లి పేరుతో ఉమ్మడి బ్యాంకు అకౌంట్..
ఇప్పటి వరకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) పద్ధతిలో ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను పొందడానికి ఇకపై విద్యార్ధి, తల్లి పేరుతో ఉమ్మడి బ్యాంకు ఖాతాను (జాయింట్ అకౌంట్) తెరవాలని సోషల్ వెల్పేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ జి. జయలక్ష్మి ఈ నెల 11వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నెల 24వ తేదీలోగా అర్హులైన విద్యార్ధుల తల్లులు బ్యాంకు ఖాతా తెరవాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. 2022 – 23 చివరి యేడాది చదువుతున్న విద్యార్ధులకు ఉమ్మడి ఖాతా అవసరంలేదన్నారు. ఉమ్మడి బ్యాంకు ఖాతా తెరవడానికి ఉత్తర్వులలో కొన్ని సూచనలు చేశారు.
- జాయింట్ అకౌంట్‌లో ప్రైమరీ అనగా ప్రధాన ఖాతాదారుడిగా విద్యార్ధి ఉండాలి, సెకండరీ ఖాతాదారునిగా తల్లి ఉండాలి.
- తల్లులు లేని విద్యార్ధులు తండ్రితో కలసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. తల్లిదండ్రులు ఇద్దరూ లేని వారు బంధువులతో కలసి ఖాతా తెరవాలి.
- ఈ ఖాతాకు ఎటువంటి డెబిట్ కార్డు ఉండదు. నేరుగా బ్యాంకుకు వెళ్ళి విద్యార్ధి, తల్లి ఇద్దరూ సంతకం పేడితేనే నగదును చెల్లిస్తారు.
- జీరో బాలన్స్‌తో ఖాతా తెరవడానికి సౌఖర్యం కల్పించారు. జీరో బాలన్స్ ఉన్నప్పటికీ ఎటువంటి ఫెనాల్టీ పడదు.
- ఈ ఖాతాకు సంబంధించి ఎటువంటి ఆన్‌లైన్ బ్యాంకిక్ సదుపాయాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌఖర్యం ఉండదు.
సచివాలయాల ఆధ్వర్యంలో…
ఉమ్మడి బ్యాంకు ఖాతాలు సచివాలయాల ఆధ్వర్యంలో జరుగనున్నాయి. ఆయా జిల్లాల వారీగా లబ్దిదారుల జాబితాలను సోషల్ వెలేర్ అధికారులు సచివాలయ సిబ్బందికి అందజేస్తారు. వారు ఆడేటాను సంబంధిత బ్యాంక్ కోఆర్డినేటర్‌లకు అందజేయాల్సి ఉంది. బ్యాంకు కోఆర్డినేటర్లు ప్రతిరోజు నిర్ధిష్ట సంఖ్యలో ఖాతాలను తెరుస్తారు. సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు సంబంధిత లబ్దిదారుల వద్దకు వెళ్ళి పూర్తి వివరాలను తెలియపరుచుతారు.
లబ్దిదారులను తమ వెంట తీసుకుని బ్యాంకుకు వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయిస్తారు. అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత సచివాలయ కార్యదర్శి పాస్ పుస్తకం మొదటి పేజీని నవశకం పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంది. అనంతరం సంబంధిత జి ల్లా వెల్ఫేర్ అధికారి అకౌంట్ నెంబరు, తదితర అంశాలను జన్మభూమి పోర్టల్‌లో పరిశీలించాల్సి ఉంది.