అమరావతి, ఆంధ్రప్రభ: వీఐటీవిశ్వవిద్యాలయ బీటెక్ విద్యార్థి సుధాన్షు దొడ్డి రూ. 63 లక్షల ప్యాకేజీతో అమెరికాకు చెందిన ప్రముఖ అనలిటిక్స్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా గురువారం సుధీన్షును సత్కరించిన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా. ఎస్వీ కోటా రెడ్డి మాట్లాడుతూ వీఐటీ- ఏపీ అవలంబించే అత్యుత్తమ విద్యా విధానాలు, విద్యార్థుల అకుంఠిత దీక్ష వల్లే ఇటు-వంటి అనితర సాధ్యమైన విజయాలను సాధించగలుగుతున్నామని అన్నారు. ప్రపంచానికి బాధ్యతగల రేపటితరం నాయకులను అందించటానికి వర్సిటీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈనెల 24 నాటికి 627 మంది వీఐటీ- ఏపీ విద్యార్థులకు 1175 ఉద్యోగ అవకాశాలు వచ్చాయని, ఇందులో 246 సూపర్ డ్రీం ఆఫర్స్ కాగా, 354 డ్రీం ఆఫర్స్ అని వివరించారు. అత్యధిక పారితోషికం సంవత్సరానికి రూ. 63 లక్షలు కాగా, ఇది గత ఏడాదితో పోలిస్తే రూ. 20 లక్షలు అధికమన్నారు. ఈ సంవత్సరం విద్యార్థుల సరాసరి పారితోషికం గతేడాదితో పోలిస్తే సంవత్సరానికి రూ. 6.77 లక్షల నుంచి 7.3 లక్షలకు పెరిగిందన్నారు.
కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ డైరెక్టర్ డా. వి. శామ్యూల్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ ఈ ఉద్యోగ ఎంపిక ప్రక్రియలో దాదాపు 805 బహుళజాతి సంస్థలు పాల్గొన్నాయని, అందులో ఇంటెన్, బాష్, విసా, మైక్రోసాఫ్ట్, వాల్‌మార్ట్, అడోబ్, అమెజాన్, ఫిలిప్స్, ఐబీఎమ్ తదితరాలు ఉన్నాయని తెలిపారు. వీఐటీ ఫౌండర్ ఛాన్సలర్ డా. జి. విశ్వనాథన్ మాట్లాడుతూ అంతర్జాతీయ సంస్థలలో నియామకాల గమ్యస్థానంగా వీఐటీ నిలవటం గర్వకారణమని, ప్రతిభావంతులైన విద్యార్థులను తీర్చిదిద్దటంలో ఎల్లప్పుడూ ముందుటు-ందని పేర్కొన్నారు. సుధాన్షు దొడ్డి మాట్లాడుతూ వీఐటీ విశ్వవిద్యాలయం అందించిన విలువలతో కూడిన అత్యుత్తమ విద్య, సాంకేతిక పరిజ్ఞానాల ద్వారానే ఈ విజయం సాధ్యమైనదని, వీఐటీ- ఏపీ యాజమాన్యానికి, ఉపాధ్యాయులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నాన్నారు. విద్యార్థి సత్కార కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. సీఎల్వీ శివకుమార్, డా. సీహెచ్ ప్రదీప్ రెడ్డి(డిప్యూటీ- డైరెక్టర్, కెరీర్ డెవలప్మెంట్ సెంటర్), డీన్లు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.