అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో అతి పెద్ద క్రీడా మేళా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. యువతను, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ స్థాయిల్లో క్రీడా పోటీలు నిర్వహించాలని భావిస్తోంది. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) ఆధ్వర్యంలో భారీ స్థాయిలో వివిధ ఆటల పోటీలు జరిపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. సీఎం కప్ పేరిట క్రీడా పోటీలను నిర్వహించనున్నారు. క్రికెట్, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో తదితర ఆటల పోటీలను నిర్వహించనుంది. ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా పూర్తయిన అనంతరం సెలవుల్లో ఈ పోటీలు జరపనుంది. ఈ పోటీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి.
అలాగే పోటీలు ముగిసిన అనంతరం సీఎం చేతుల మీదుగానే బహుమతులు ప్రదానం జరగనుంది. రాష్ట్రంలో గతేడాది కాలంగా వివిధ క్రీడా పోటీలను శాప్ నిర్వహిస్తోంది. కోవిడ్-19 నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రెండేళ్ల పాటు క్రీడలు నిలిచిపోయాయి. పలువురు క్రీడాకారులు ప్రభుత్వపరంగా ప్రోత్సాహం లేకపోవడంతో నిరుత్సాహానికి లోనయ్యారు. క్రీడాకారుల నిరుత్సాహం.. క్రీడలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే విమర్శల నేపధ్యంలో గత ఏడాది కాలంగా పలు క్రీడా కార్యక్రమాల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. తద్వారా క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహమిస్తుందనే భరోసా నింపేందుకు వివిధ రకాల చర్యలు చేపట్టింది.
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్..
రాష్ట్రంలోని క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో సముచిత స్థానం కలిపించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి ఆదేశాల నేపధ్యంలో ప్రభుత్వమీ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో వివిధ క్రీడల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు నగదు, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తోంది. తద్వారా గ్రామీణ స్థాయి క్రీడాకారులు ఆయా క్రీడల్లో వ్యక్తిగత ప్రతిభ చూపేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంతో పాటు రాష్ట్రేతర ప్రాంతాల్లో నిర్వహించే పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను ప్రభుత్వం సొంత ఖర్చులతో పంపుతోంది.
జగనన్న క్రీడా సంబురాలు..
రాష్ట్రంలో గతేడాది జగనన్న క్రీడా సంబురాలు పేరిట శాప్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించింది. మండల స్థాయిలో పోటీలను నిర్వహించి ప్రతిభ చూపిన క్రీడాకారులను జిల్లా స్థాయి క్రీడలకు ఎంపిక చేసింది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని మండలాల్లో జగనన్న క్రీడా సంబురాల నిర్వహణకు శాప్ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. ఇదే క్రమంలో రాష్ట్రస్థాయిలో సైతం పలు కార్యక్రమాలు నిర్వహించి క్రీడాకారులను ప్రత్యేకంగా ప్రభుత్వం సత్కరిస్తూ వస్తోంది. గతేడాది డిసెంబర్‌లో జగనన్న క్రీడా సంబరాల విజేతలకు రాష్ట్రస్థాయి కార్యక్రమం నిర్వహణ ద్వారా పెద్ద ఎత్తున బహుమతులను శాప్ అందజేసింది. రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని మరిన్ని క్రీడా పోటీల నిర్వహణకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోంది.
స్టేడియంల అభివృద్ధి..
రాష్ట్రంలోని పలు స్టేడియాలు క్రీడల నిర్వహణ, క్రీడాకారుల ప్రాక్టీసుకు అనువుగా లేవని ప్రభుత్వం గుర్తించింది. వీటిని శాప్ ఆధ్వర్యంలో ఆధునీకరించేందుకు ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రీడా మైదానాల అభివృద్ధి పేరిట ‘పే అండ్ ప్లే’ విధానం అమలులోకి తెచ్చింది. క్రీడాకారుల నుంచి నెలవారీ రుసుము వసూలు చేస్తూ మైదానాలను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొంది. నెలవారీ రుసుముల వసూళ్లకు ప్రత్యేకంగా కోచ్‌లకు టార్గెట్లు కూడా విధించడంతో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. క్రీడాకారులు, క్రీడా సంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన నేపధ్యంలో కొన్ని క్రీడలకు మినహా మిగిలిన వాటిని నిలిపేస్తూ ఇటీవల శాప్ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో క్రీడా మైదానాల అభివృద్ధిపై ప్రభుత్వమే దృష్టిసారించింది. శాప్ ఆధ్వర్యంలో స్టేడియాల ఆధునీకరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని క్రీడా మైదానాలను అభివృద్ధి చేయనున్నట్లు శాప్ వర్గాలు చెపుతున్నాయి.
సీఎం కప్..
క్రీడలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను విస్తృత ప్రచారం చేసే క్రమంలో భాగంగా రాష్ట్రస్థాయిలో సీఎం కప్ పేరిట క్రీడా సంబరాల నిర్వహణకు శాప్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ రకాల పరీక్షలు జరుగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని పరీక్షలు ముగిసిన తర్వాత సీఎం కప్ పోటీలను నిర్వహించనున్నారు. ఈలోగా ఏయే క్రీడలు ఎక్కడ నిర్వహించాలి అనే అంశంపై కసరత్తు జరగుతోంది. అది ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రితో పోటీలను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో భారీ కార్యక్రమం నిర్వహణ ద్వారా పోటీల్లో విజేతలను ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందించనున్నట్లు శాప్ వర్గాల సమాచారం. తొందరలోనే ఇందుకు సంబంధించి విధివిధానాలు ప్రకటించనున్నారు.