అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో : నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతోంది. అందుకోసం మరికొన్ని కార్పొరేషన్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తోంది. వాటి పరిధిలో వేలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. వాటిలో కొన్ని కార్పొరేషన్లను ఏజెన్సీలకు అప్పగించి వారి ఆధ్వర్యంలోనే ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. సరిగ్గా ఇక్కడే అక్రమాలు జరుగుతున్నాయి. తమ ఏజెన్సీల ద్వారా నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశం కల్పిస్తామంటూ ప్రచారంచేస్తూ వారిని నిలువునా దోచుకుంటున్నారు. తమ తప్పులను కప్పి పుచ్చుకునేదుకు మొక్కుబడిగా కొంత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి అత్యధిక శాతం మందికి మొండిచేయి చూపుతున్నారు. దీంతో ఏజెన్సీల నిర్వాకం ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబరు 2వ తేదీ గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మిషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా చెత్త వాహనాలను ప్రారంభించింది. ప్రతి మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల్లో నిత్యం ఆ వాహనాల ద్వారా చెత్తను తరలించి ఆయా ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకోసం కాంట్రాక్టు విధానం ద్వారా ఏజెన్సీలకు ఆబాధ్యతలను అప్పగించారు.
గుంటూరుకు చెందిన ప్రముఖ ఏజెన్సీ ఆవాహనాలకు సంబంధించి డ్రైవర్ ఉద్యోగాలను ఇస్తామంటూ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు చెందిన నిరుద్యోగుల నుండి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో డ్రైవర్ ఉద్యోగానికి రెండు విడతలుగా రూ. 50 వేల వరకూ వసూలు చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆఏజెన్సీ అధినేత పీఏ వ్యక్తిగత ఖాతా ద్వారా ఆయా జిల్లాలకు చెందిన నిరుద్యోగుల నుండి నగదు లావాదేవీలు సాగినట్లు తెలుస్తోంది. అయితే, డ్రైవర్ ఉద్యోగాలకోసం వారు అడిగిన మామూళ్లు ముట్టజెప్పి నెలలు కావస్తున్నా.. ఉద్యోగం ఊసే లేదు. దీంతో పలువురు నిరుద్యోగులకు అనుమానం వచ్చి ఏజెన్సీని సంప్రదించగా మాయమాటలు చెబుతూ రేపు, మాపు అంటూ కాలం వెల్లబుచ్చుతున్నారు. అసలు ఉద్యోగం వస్తుంద..రాదా..లేదంటే మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయండని పలువురు నిరుద్యోగులు ఏజెన్సీ నిర్వాహకులను నిలదీస్తున్నారు. ఈక్రమంలోనే ఈ అవినీతి బాగోతం వెలుగుచూసింది.
అక్రమాలు ఇలా..:
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 4,097 చెత్త తరలింపు వాహనాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. అందుకు సంబంధించి గుంటూరుకు చెందిన ఓ ఏజెన్సీకి ఆబాధ్యతలను అప్పగించింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వం సూచించిన విధంగా నిత్యం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చెత్తను తరలించాల్సి ఉంది. అందుకోసం ఓ డ్రైవర్ , మరో హెల్పర్‌ఒను నియమించాల్సి ఉంది. ప్రభుత్వం కాంట్రాక్టు ఇచ్చిన ప్రకారం డ్రైవర్‌కు నెలకు రూ. 18 వేలు జీతం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా డ్రైవింగ్ లైసెన్సు కలిగిన నిరుద్యోగులు ఆ ఏజెన్సీని సందప్రదించారు. డ్రైవర్ ఉద్యోగం కావాలంటే అన్ని అర్హతలతోపాటు ఏజెన్సీ కమీషన్ కింద రూ. 50 వేలు ఖర్చవుతుందని చెప్పి వారి వద్ద నుండి వసూలు చేసినట్లు తెలుస్తోంది. అందుకోసం ఆఏజెన్సీ అధినేత పీఏ ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ పీఏ నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో ఆజిల్లాకు చెందిన వారే ఎక్కువ మంది అతనిద్వారా ఏజెన్సీని సంప్రదించి వారి సూచనల మేరకు సుమారు 67 మంది డ్రైవర్ ఉద్యోగాల కోసం రూ. 50 వేల వంతున చెల్లించారు. గత ఏడాది డిసెంబరు వరకూ దశలవారీగా ఆమొత్తాన్ని కూడా పీఏ సొంత ఖాతాకు జమ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల నుండి కూడా పెద్ద ఎత్తున డ్రైవర్‌ఒ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పోటీపడి అదే మొత్తాన్ని చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే, నెల్లూరు జిల్లాకు చెందిన నిరుద్యోగులు డబ్బు చెల్లించి నెలలు గడుస్తున్నా..ఉద్యోగం ఊసే లేకపోవడంతో అనుమానం వచ్చి ఏజెన్సీ అధినేత పీఏను నిలదీ సినట్లు సమాచారం. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిరుద్యోగులంతా తాము మోసపోయామని గ్రహించి తమ డబ్బును తిరిగి చెల్లించాలని ఏజెన్సీపై వత్తిడి తీసుకొస్తున్నారు. ఈనేపథ్యంలోనే జనవరి నుండి మూడు సార్లు వాయిదా వేసిన నిర్వాహకులు చివరిగా మార్చి 20వ తేదీ లోపు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఆ గడువు కడా పూర్తవడంతో మోసపోయిన నిరుద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమౌతున్నట్లు తెలిసింది.
500 మందికిపైగా బాధితులు
4,097 చెత్త తరలింపు వాహనాలకు సంబంధించి అదే సంఖ్యలో డ్రైవర్లను నియమించాల్సి ఉంది. అయితే, తొలి విడతలో గుంటూరుకు చెందిన ఏజెన్సీ 1,700 వాహనాలను కొనుగోలుచేసి ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఆయా జిల్లాలకు పంపింది. దీంతో మొదటి విడత 1,700 మందికే డ్రైవర్ ఉద్యోగాలకు అవకాశం దక్కింది. మిగిలిన 2,797 డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించి భర్తీ చేసేందుకు వాహనాలను కొనుగోలు చేయాల్సి ఉంది. ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో ఆవాహనాలను కొనుగోలు చేయడంలో కొంత జాప్యం జరిగింది. దీంతో కడప జిల్లాకు చెందిన మరో ఏజెన్సీ అధినేత 500 వాహనాలను కొనుగోలుచేసి నెల్లూరు, కడప జిల్లాల్లో చెత్త తరలించేందుకు ఏర్పాటు చేశారు. అదే ఏజెన్సీ ద్వారా డ్రైవర్ ఉద్యోగాలకు కూడా భర్తీ చేస్తున్నారు. దీంతో నెల్లూరు, కడప జిల్లాలతోపాటు ఆయా జిల్లాల్లో డబ్బులు చెల్లించిన 500 మందికిపైగా నిరుద్యోగులు ఆందోళనకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది.