అమరావతి, ఆంధ్రప్రభ: ఉన్నత విద్య నుండి ప్రతిభావంతులైన విద్యార్ధులను ప్రోత్సహించాలనే ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్)ను ప్రవేశపెట్టింది. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్ధులకు చేయూతనందించడానికి కేంద్ర విద్యాశాఖకు సంబంధించిన స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ విభాగం ఈ స్కాలర్‌షిప్‌ను అర్హత సాధించిన వారికి అందిస్తుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 8వ తరగతి విద్యార్ధులకు నిర్వహించే ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా లక్ష మంది విద్యార్ధులను ఎంపిక చేస్తారు. ఈ యేడాది జరిగే పరీక్షలలో ఏపీ నుండి 4,087 మందికి అవకాశం కల్పించారు. ఈ స్కీమ్‌కు ఎంపికైన విద్యార్థులకు 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు నెలకు రూ వెయ్యి చొప్పున యేడాదికి 12వేలు అందజేస్తారు.
ఇలా నాలుగు సంవత్సరాల పాటు రూ. 4,80,000 నగదు ప్రోత్సాహకాన్ని విద్యార్ధుల ఖాతాలో జమ చేస్తారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబరు 29వ తేదీతో దరఖాస్తు గడువు ముగిసింది. డిసంబర్ 4వ తేదీన జరిగే పరీక్షకు సన్నద్ధమవుతున్నమవుతున్నారు. 4వ తేదీన జరిగే ఈ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (బిఎస్‌ఈ) ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాలలో పరీక్షలను నిర్వహిస్తారు.
ఎన్‌ఎమ్‌ఎమ్‌కు ఈ అర్హతలు ఉండాలి
ఈ పరీక్ష రాయడానికి రాష్ట్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్. మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల్లో, వసతి సౌకర్యంలేని ఆదర్శ పాఠశాలల్లో చదివే 8వ తరగతి విద్యార్థులు మాత్రమే అర్హులు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఏడవ తరగతిలో 50 శాతం మార్కులతో బీసీ మరియు ఇతరులు 55 శాతం మార్కులతో ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వీరి తల్లిదండ్రుల యొక్క సంవత్సర ఆదాయం 3.50 లక్షల లోపు ఉన్న విద్యార్థులు ఈ పరీక్ష రాయుటకు అర్హులు. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు , సంవత్సరాదాయం నాలుగు లక్షల కంటే ఎక్కువ ఉన్న వారి పిల్లలు ఈ పరీక్షకు అనర్హులు. ఈ యేడాది జరిగే పరీక్షలకు ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు లేని వారికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. కాని పరీక్షల సమయంలో వారు సదరు పత్రాలను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు.
రాత పరీక్షకు ఎంపికయిన విద్యార్ధుల జాబితా నుండి మెరిట్ రిజరేషన్ల ప్రకారం స్కాలర్‌షిప్ అర్హులను ఎంపిక చేస్తారు. మ్యాట్, సాట్ పరీక్షలో జనరల్, బీసీ, పిహెచ్ విద్యార్ధులకు 40 శాతం (36 మార్కులు), ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు 32 శాతం (29 మార్కులు)తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎంపికయిన వారు ప్రతి నెలా అందచేసే రూ వెయ్యి స్కాలర్‌షిప్ పొందడానికి పేరెంట్స్‌తో కలిసి ఎస్‌బిఐ లేదా జాతీయ గుర్తిపు కలిగిన బ్యాంకులో జాయింట్ అకౌంట్ తీసుకోవాలి.
ఎంపికయిన విద్యార్ధులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (ఎన్‌ఎస్‌పి)లో రిజిష్టరై, అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయాలి. సబ్‌మిట్ చేసిన అప్లికేషన్ ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్‌కు చెందిన నోడల్ ఆఫీసర్ పరీశీలించిన తరువాత ఆమోదిస్తూ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ (డిఎన్‌వో)కు పంపిన తరువాతనె స్కాలర్‌షిప్ విడుదలవుతుంది. తొమ్మిదవ తరగతి నుండి స్కాలర్ షప్ కొనసాగాలంటే నిర్ధేశిత మార్కులు తప్పనిసరిగా సాధించాల్సి ఉంటుంది. పదవ తరగతిలో 60 శాతం మార్కులు తప్పనిసరిగా పొందాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు 55 శాతం మార్కులు తప్పనిసరిగా పొందాలి.