బెంగళూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ నేడు బెంగళూరులో పర్యటించింది. ఈ కమిటీలో సభ్యులైన ఏపీ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, సంధ్యారాణిలు కర్ణాటక ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు.
కర్నాటక మంత్రులు, అధికారులతో ఈ పధకం అమలు జరుగుతున్న తీరును సబ్ కమిటీ తెలుసుకుంంది. బెంగళూరులో ప్రధాన డిపోలను కమిటీ పరిశీలించింది. ఈ సందర్భంగా మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, ఏపీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై కర్ణాటకలో అధ్యయనం చేస్తున్నామని చెప్పారు.
దీనిపై కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి గారిని సహా కర్ణాటక ఆర్టీసీ అధికారులతో చర్చలు కొనసాగిస్తున్నామని తెలిపారు.
ఈ ఉగాది నుంచి ఎపిలో ఉచిత బస్సు పథకం అమలు చేయాలనే లక్ష్యంతో ఎపి రవాణ శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సారధ్యంలో ఏర్పాటైన సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్న తాను, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి,ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండేతో కలిసి ఈ పథకం అమలు చేయడంపై కసరత్తు చేస్తున్నామన్నారు.
కర్ణాటకలో మహిళా ప్రయాణికులకు కలుగుతున్న సౌకర్యం, లబ్ధి గురించి కర్ణాటక బస్సుల్లో ప్రయాణం చేస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నామని తెలిపారు. ఇక నేటి సాయంత్రం కర్నాటక సిఎం సీఎం సిద్దరామయ్యను ఏపీ మంత్రుల బృందం కలిసి ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ఆయన సూచనలు,సలహాలు స్వీకరించనుంది.