Saturday, November 23, 2024

గురుకులంలో ఏడో క్లాస్ చ‌దివే బాలిక 7 నెలల గర్భిణి.. గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్‌

ఓ కామాంధుడి మాయమాటలు నమ్మి ఓ మైనర్‌ బాలిక మోసపోయింది. ఇంటి పక్కనే ఉంటూ వరుసకు అన్న అయిన వాడు.. 13 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి తన వాంఛ తీర్చుకున్నాడు. ఆ బాలిక కడుపునొప్పితో ఆస్ప‌త్రికి వెళ్ల‌గా పరీక్షలు నిర్వహించిన డాక్ట‌ర్లు ఏడు నెలల గర్భిణి అని గుర్తించారు. ఇది ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండలంలోని ఓ గురుకుల పాఠశాలలో జ‌రిగింది.

అన్నమయ్య, ప్రభ న్యూస్‌: చిన్నమండెం మండలానికి చెందిన ఓ మైనర్‌ బాలిక జిల్లాలోని ఓ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఈ బాలిక అక్టోబర్‌ 21వ తేదీన పాఠశాలలో 7వ తరగతిలో చేరినట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ తెలిపారు. బాలిక స్వగ్రామంలోని ఇంటి పక్కనే ఉంటున్న డిగ్రీ విద్యార్థి చేతిలో మోసపోయింది. ఆ వ్యక్తి మాయమాటలు నమ్మి చివరకు గర్బం తెచ్చుకుంది. కొన్ని రోజులుగా బాలికపై డిగ్రీ విద్యార్థి కామవాంఛను తీర్చుకుంటున్నాడు. కాగా, రెండు రోజుల క్రితం గురుకుల పాఠశాల హాస్టల్‌లో ఉన్న బాలికకు కడుపునొప్పి రావడంతో అక్కడున్న అధికారులు రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలికకు వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్ట‌ర్లు ఆమె 7 నెలల గర్భవతిగా గుర్తించారు.

పురుటి నొప్పులు ఎక్కువ రావడంతో కాన్పు చేశారు. ఆడశిశువు జన్మించినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై రాయచోటి ప్రభుత్వాసుపత్రి వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిన్నమండెం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు రాయచోటి రూరల్‌ సీఐ లింగప్ప తెలిపారు. గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న మైనర్‌ బాలిక ప్రసవంపై పలు అనుమానాలకు తావిస్తోంది. పాఠశాల ప్రిన్సిపల్‌, సిబ్బంది నిర్లక్ష్యం నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి. ఘటన జరిగిన వెంటనే శుక్రవారం డీసీఓ సంతోషమ్మ పాఠశాలకు వచ్చి విచారించి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

ఇటీవల ఆ గురుకుల పాఠశాలలో ఐదుగురు బాలికలు గేటు నుండి బయటికి వెళ్లి తిరిగి లోనికి వచ్చిన ఘటన కూడా వాస్తవమని, అందుకు సూపర్‌వైజర్‌ను విధుల నుండి తొలగించినట్లు తెలిపారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా బడుగు బలహీనవర్గాలకు విద్యనభ్యసించాలని ఉద్దేశ్యంతో కోట్లాది రూపాయలు వెచ్చించి పేద విద్యార్థులకు విద్యనభ్యసిస్తున్నారు. ఇటువంటి సంఘటన పాఠశాలలో జరగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్‌ సత్యానందం, ఎంపీడీఓ నరసింహులు గురుకుల పాఠశాలను సందర్శించి విచారణ నిర్వహించారు. నివేదికను పైస్థాయి అధికారులకు పంపనున్నట్లు తెలిపారు. ఈ విషయంపై ప్రజాసంఘాలు విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement