Monday, December 23, 2024

AP | కడప కార్పొరేషన్ లో కుర్చీ తొండి

  • ఎమ్మెల్యేకు చైర్ వేయని సిబ్బంది
  • నినాదాలు.. దూషణలు.. వ్యక్తిగతారోపణలు
  • మేయర్ పై ఎమ్మెల్యే ఆగ్రహం

ఆంధ్రప్రభ స్మార్ట్ న్యూస్ – కడప బ్యూరో : కడప నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో మరోసారి గందరగోళం నెలకొంది. మేయర్ సురేష్ బాబు, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి మధ్య కుర్చీ ఫైట్ సాగుతోంది. సోమవారం కార్పొరేషన్ సమావేశంలో పొడియంపై మేయర్ సీటు పక్కన ఎమ్మెల్యే కు సీటు వేయకపోవడంతో టీడీపీ కార్పొరేటర్లు రచ్చ చేశారు. ఆందోళనకు దిగారు. మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసేలా మేయర్ వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆరోపించడంతో సమావేశంలో గందరగోళానికి దారితీసింది. ఎమ్మెల్యే పోడియంపై నిలబడి నిరసన తెలిపారు. ఆమెకు మద్దతుగా టీడీపీ కార్పొరేటర్లు, మేయర్ కు మద్దతుగా వైసీపీ కార్పొరేటర్లు పెద్దఎత్తున నినాదాలు చేశారు.

ఒకరి చేతిలోని మైకులు, అజెండా కాపీలను మరొకరు లాగేసుకునే ప్రయత్నం చేశారు. అజెండా కాపీలను చించివేశారు. ఈ క్రమంలో వైసీపీ – టీడీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వివాదం జరిగింది. తోపులాట జరిగింది. మహిళా కార్పొరేటర్లు ఒకరిని ఒకరు తోసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో సమావేశం తీవ్ర ఉద్దేక్తతకు దారితీసింది. ఎమ్మెల్యేకు మద్దతుగా టీడీపీ కార్పొరేటర్లు ఆమె వెనుకే నిలబడి నినాదాలతో హోరెత్తించారు. మేయర్ సురేష్ పై వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. దీంతో వైసీపీ కార్పొరేటర్లు మేయర్ సీటు వద్ద నేలపై కిందకూర్చుని నిరసనకు దిగారు. ఎమ్మెల్యే పై ఆరోపణలు చేస్తూనే సమావేశాన్ని కొనసాగించాలని పట్టుపట్టారు. దీంతో సమావేశం రచ్చ రచ్చగా మారింది. దాదాపు రెండుగంటలపాటు ఈ రచ్చ కొనసాగింది.

సస్పెండ్ చేసిన తగ్గని టిడిపి కార్పొరేటర్లు..
సమావేశాన్ని అడ్డుకుంటూ తీవ్ర గందరగోళానికి కారణమైన టిడిపి అనుబంధ కార్పోరేటర్ లను మేయర్ సురేష్ బాబు సస్పెండ్ చేశారు. వారు వెంటనే సమావేశం నుంచి బయటికి వెళ్లాలని ఆదేశించినా వారు ఖాతరు చేయలేదు. ఎమ్మెల్యే మాధవికి మద్దతుగా నినాదాలు చేస్తూ పోడియం పైనే ఆందోళనకు దిగారు. మరోవైపు వైసీపీ కార్పొరేటర్లు సమావేశం నిర్వహించాలని, అజెండాలోని అంశాలను చదవాలని పట్టుబడుతూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో సమావేశం ప్రారంభం కాకుండానే అదుపుతప్పి ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. కార్పొరేటర్లు ఒకరిపై ఒకరు పై చేయి సాధించాలని భావనతో మైకులు తీసుకొని పెద్ద ఎత్తున కేకలు వేస్తూ ఆరోపణలకి దిగారు.

- Advertisement -

ఈ క్రమంలో మరోసారి మేయర్ సురేష్ బాబు పోడియం పై ఉన్న వారందరినీ సమావేశం నుంచి బయటకు పంపాలని పోలీసులను కోరారు. పోలీసులు పోడియం వరకు చేరుకుని ఆందోళన చేస్తున్న కార్పొరేటర్ లను సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో చేసేది లేక మేయర్ సమావేశాన్ని వాయిదా వేసి బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్యే మాధవి రెడ్డి, టిడిపి కార్పొరేటర్లు కూడా సమావేశం మందిరం నుంచి బయటకు వెళ్లడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

కార్పొరేషన్ గేటు బయట ఆందోళన..
గత సమావేశం అనుభవం దృష్ట్యా కార్పొరేషన్ కార్యాలయం బయట పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు కడప ఒకటో పట్టణ సీఐ రామకృష్ణ తెలిపారు. 30 పోలీసు యాక్టు అమలు చేశారు. కానీ టిడిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్పొరేషన్ కార్యాలయం వద్దకు చేరుకుని ఎమ్మెల్యే మాధవి రెడ్డికి కూలంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో కాసేపు కార్పొరేషన్ గేటు వద్ద ఉద్రిక్తత కనిపించింది. అయితే పోలీస్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని ఆందోళన చేస్తున్న వారందరిని అక్కడ నుంచి పంపించివేసి పరిస్థితిని అదుపు చేశారు. కార్పొరేషన్ పరిసర ప్రాంతాల్లో మొత్తం 12 మంది సీఐలు, 20 మంది ఎస్సైలు, 50 మంది ఏఎస్పైలు, హెడ్ కానిస్టేబుళ్లు, 100 మంది కాని స్టేబుళ్లతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సీఐ పేర్కొన్నారు.

మహిళ ప్రజా ప్రతినిధిని అవమానిస్తారా .. : ఎమ్మెల్యే మాధవి రెడ్డి
మేయర్ సురేష్ బాబుకు మహిళలంటే చిన్నచూపు నెలకొందని కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆరోపించారు. మహిళ ఎమ్మెల్యేను అని చూడకుండా తనకు కుర్చీ వేయకుండా నిలబెట్టారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో కుడి, ఎడమ వైపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టకపోవడంలో ఆంతర్యమేంటి అంటూ ఆమె ప్రశ్నించారు. మహిళను మేయర్ అవమానపరుస్తున్నారు. నన్ను అవమానిస్తే మీ నాయకుడు సంతోషపడవచ్చేమో. తన కుర్చీని లాగేస్తారని మేయర్ భయపడు తున్నట్లున్నారు. అందుకే మేయర్ కుర్చీలాట ఆడుతున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement