Friday, November 22, 2024

ఎన్నికల నిర్వహణకు పక్కా ప్లాన్.. పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి : ఎస్పీ సీహెచ్‌ విజరావు

నెల్లూరు, (ప్రభ న్యూస్‌): బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఎటువంటి ఆటంకాలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా జరిగేందుకు పక్కా ప్లాన్ సిద్దం చేశామని జిల్లా ఎస్పీ సీహెచ్‌ విజయరావు పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఎస్పీ విజయరావు విలేకరులతో మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్ట మైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 1500 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.

ఈ నెల 5వ తేది ముగిసిన నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందన్నారు. బుచ్చిరెడ్డిపాళెం ప్రాంతాలలో ఇప్పటివరకు 138 మంది రౌడీషీటర్లను బైండోవర్‌ చేశామ, ట్రబుల్‌ మాంగర్స్‌కు కౌన్సిలింగ్‌ నిర్వహించి వారిపై నిఘా ఉంచామని అన్నారు. 256 లైసెన్స్‌ ఆయుధాలు ఉండగా.. వాటిలో 245 ఆయుధాలను ఆయా స్టేషన్ల పరిధిలలో స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. బ్యాంకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వాటికి సంబంధించిన ఆయుధాలను మినహాయించామన్నారు.

నెల్లూరు నగరంలోని, బుచ్చిరెడ్డిపాళెం ప్రాంతాలలో 54 డివిజన్ల పరిధిలలో 75 సాధారణ, 235 సమస్యాత్మక, 140 అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయన్నారు. వాటిపై ప్రత్యేక దృష్టి సారించామని ఎస్పీ తెలిపారు. అదేవిధంగా బుచ్చిరెడ్డిపాళెంలోని 20 వార్డుల పరిధిలలో 16 సాధారణ, 21 సమస్యాత్మక, ఒక అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ బూత్‌లను గుర్తించామన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ బూత్‌ల వద్ద అవసరమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తున్నామన్నారు.

జరగబోయే ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వినియోగించే నగదు, మద్యం కట్టడి చేసేందుకు జిల్లావ్యాప్తంగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని, అదేవిధంగా హెల్ప్‌ లైన్‌ నెంబర్లను కూడా ఏర్పాటు చేశామని ఎస్పీ విజయరావు పేర్కొన్నారు. నగరంలోని ఇరుకళల పరమేశ్వరీ దేవస్థానం, వెంకటేశ్వరపురం, మైపాడు గేటు, బుజబుజనెల్లూరు, కొత్తూరు, గొలగమూడి క్రాస్‌ రోడ్డు, చింతారెడ్డిపాళెం, సాలుచింతల ప్రాంతాలలో ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి 24 గంటలు ప్రత్యేక బృందాల ద్వారా వాహనాల తనిఖీ చేపడుతున్నామన్నారు.

అంతేకాకుండా చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రజలు సమాచారం అందించేందుకు 7093276506, 9440796385 హెల్ప్‌ లైన్‌ నెంబర్లు ఏర్పాటు చేశామన్నారు. నగదు, మద్యం, ఇతర కార్యకలాపాలపై ప్రజలు ఈ నెంబర్లకు సమాచారం ఇవ్వొచ్చని, వారి వివరాలు గోప్యంగా ఉంచి తగుచర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకునేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని ఎస్పీ విజయరావు ఈ సందర్భంగా తెలియ‌జేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement