(ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో) : సిటీ కేబుల్ వ్యవస్థాపకుడు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఇవాళ అట్టహాసంగా ప్రారంభమైంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల మధ్య హోరాహోరీగా క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ పరిధిలో ఉన్న యనమలకుదురులోని కేకే గ్లోబల్ క్రికెట్ అకాడమీలో ప్రారంభమైన స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను జ్యోతి ప్రజ్వళన చేసి సిటి కేబుల్ ఎండి పొట్లూరి సాయిబాబు ప్రారంభించారు. పొట్లూరి రామకృష్ణ చిత్రపటానికి సిటి కేబుల్ ఎండి పొట్లూరి సాయిబాబు, జీ తెలుగు ఏపీ
డిస్ట్రిబ్యూషన్ హెడ్ పి వెంకటరావు, సిటీ కేబుల్ సిబ్బంది, స్థానిక పత్రికా విలేకరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
సిటీకేబుల్ వ్యవస్థాపకులు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా పొట్లూరి రామకృష్ణ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నట్లు పొట్లూరి సాయిబాబు తెలిపారు. ఈ ఏడాది కూడా డిసెంబర్ 15, 16, 17 తేదీల్లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో సిటీకేబుల్, పోలీస్, రెవెన్యూ, డాక్టర్స్, లాయర్స్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, లోకల్ ఛానల్స్ మొత్తం ఎనిమిది టీమ్స్ పాల్గొంటున్నాయన్నారు. ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరుగుతుందన్నారు. టోర్నమెంట్ విజేతకు 30వేల రూపాయలు క్యాష్ ప్రైజ్, రన్నరప్ కు 20వేల రూపాయలు క్యాష్ ప్రైజ్ ను అందిస్తున్నామన్నారు. పోటీల్లో గెలుపొందిన విజేతకు జనవరి 28న స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ జయంతి రోజున బహుమతులు అందజేస్తామన్నారు. ఈ టోర్నమెంట్ కు జీ తెలుగు స్పాన్సర్ గా వ్యవహరిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ ఉద్యోగరీత్యా పని ఒత్తిడికి గురవుతున్న సందర్భంలో క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయన్నారు.
క్రీడల్లో ప్రతిభ ఉన్న వారి కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించే అంత సమయం కూడా లభించదన్నారు. వివిధ వృత్తుల్లో పనిచేసే వారి ప్రతిభను ప్రోత్సహించేందుకు, వారిలో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు ఆటవిడుపుగా ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో క్రీడాస్ఫూర్తితో ఆడి విజేతగా నిలవాలని ఉన్నట్లు చెప్పారు.