అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రంలో బలమైన రాజకీయ పార్టీగా ఇప్పటికే గట్టి పునాదులను నిర్మించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో కూడా మరింత బలమైన శక్తిగా అవతరించే దిశగా అడుగులు వేస్తోంది. అందుకోసం ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే త్వరలో మంత్రివర్గ విస్తరణను చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే 2019లో తొలిసారిగా అధికారాన్ని సొంతం చేసుకున్న వైసీపీ మంత్రివర్గంలోని 25 మందిని తీసుకుంది. ఆ సమయంలోనే సీఎం జగన్ రెండున్నర సంవత్సరం తర్వాత మంత్రి వర్గంలో మార్పులు చేస్తానని ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఇటీవల మంత్రి వర్గ సమావేశంలో సహచర మంత్రులకు మంత్రివర్గ విస్తరణపై సంకేతాలిచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్త మంత్రి వర్గంపై చర్చ మొదలైంది. పదవులు ఆశిస్తున్న వారంతా ఈసారైనా జగన్ కేబినేట్‌లో తమకు బెర్ట్ దొరుకుతుందన్న ఆశతో వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
అయితే నిన్నమొన్నటి వరకు ప్రస్తుత మంత్రి వర్గంలో ఎవరు ఉంటారో? ఎవరి పదవులు పోతాయో? అనే అంశంపై చర్చ జరగగా, తాజాగా కొత్త కేబినేట్‌లో ఎవరికి కొలువు దక్కుతుంది అనే అంశంపై కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఈ నేపధ్యంలోనే పార్టీ కోసం త్యాగాలు చేసిన వారికి ప్రాధాన్యతనివ్వబోతున్నారని పార్టీలో అంతర్గతంగా ప్రచారం సాగుతోంది. మరోవైపు తొలితరం దోస్తులకు సీఎం జగన్ అవకాశం కల్పించబోతున్నారంటూ మరో ప్రచారం తెరపైకి వచ్చింది. అదే జరిగితే పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న తొలితరం నేతలకు మంత్రివర్గ విస్తరణలో మొదటి ప్రాధాన్యత దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొంత మంది సీనియర్ల పేర్లను సీఎం జగన్ పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో కూడా ఏపీ మంత్రివర్గ విస్తరణ అంశం హాట్ టాపిక్‌గా మారింది.
తొలితరం దోస్తులకు చాన్స్
2011లో వైసీపీ పురుడుపోసుకుంది. పార్టీ ఆవిర్భావ సమయంలో సీఎం జగన్ వెంట ఒకట్రెండు కుటుంబాలు మాత్రమే నడిచాయి. ప్రస్తుతం కేబినెెట్‌లో ఉన్న పలువురు మంత్రులతో పాటు పార్టీలో వివిధ పదవులు అనుభవిస్తున్న నేతలంతా ఆ తర్వాత ఒక్కొక్కరు పార్టీలో చేరినవారే. అంతకుముందు అనేకమంది సీనియర్ నేతలు జగన్ వెన్నంటే నడిచారు. అయితే వివిధ కారణాల వద్ద పార్టీ అధికారంలోకి వచ్చినా సీఎం జగన్ తొలితరం నేతలకు మంత్రివర్గంలో ప్రాధాన్యతను ఇవ్వలేకపోయారు. అయితే ఆ లోటును ప్రస్తుత మంత్రివర్గ విస్తరణలో భాగంగా భర్తీ చేసే దిశగా సీఎం జగన్ యో చిస్తున్నట్లు తెలుస్తోంది. గత 11 సంవత్సరాలుగా వైసీపీ అనేక ఒడుదొడుకులను ఎదుర్కొంది. జగన్ కూడా అనేక కష్టాలను, నష్టాలను ఓర్చుకుని పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అనేక సందర్భాల్లో సీఎం జగన్ రాజకీయంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం కూడా సృష్టించాయి. ఈ నేపధ్యంలోనే పార్టీ ఆవిర్భావానికి ముందు, ఆవిర్భావం తర్వాత తన వెంట నడిచిన కీలకమైన నేతలకు మంత్రివర్గ విస్తరణలో భాగంగా అందలం ఎక్కించాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ప్రస్తుత కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిలు గతంలో తమ అధికారిక పదవులకు రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. ఇదే క్రమంలో జగన్ పార్టీ స్థాపించాక రాష్ట్రవ్యాప్తంగా 17మంది ఎమ్మెల్యేలు జగన్ వెంట నడిచారు. వారు కూడా తమ పదవులకు రాజీనామాలు చేశారు.
అదే సందర్భంలో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసి విజయభేరి మోగించారు. అయితే ఆ సమయంలో టీడీపీ నుంచి గెలుపొంది జగన్‌తో అడుగులు వేసేందుకు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ముందుకొచ్చారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేశారు. అంతకు ముందు నెల్లూరు ఎంపీగా ఉన్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి(కాంగ్రెస్) కూడా రాజీనామా చేశారు. నెల్లూరు జిల్లా నుంచి వారితో పాటు ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా రాజీనామా చేసి జగన్ వెంటే నడిచారు. నెల్లూరు జిల్లా నుంచి రెండు బలమైన రాజకీయ కుటుంబాలు పదవులు త్యాగం చేయడంతో పాటు జగన్‌పై తమకున్న మమకారాన్ని చాటుకున్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా కడప, ప్రకాశం, ఉత్తరాంధ్ర, చిత్తూరు, తదితర జిల్లాల నుంచి బలమైన నాయకులంతా టీడీపీ, కాంగ్రెస్‌లకు రాజీ నామాలు చేసి జగన్‌తో పాటు అడుగులు వేశారు. ప్రస్తుతం వారిలో కొంతమందికి మాత్రమే కీలకమైన పదవులు లభించాయి. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిలాంటి నమ్మకమైన నాయకులకు వివిధ కారణాల వల్ల కేబినెట్‌లో చోటు కల్పించలేకపోయారు. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో ప్రసన్నకుమార్‌రెడ్డితో పాటు ఆయా జిల్లాలకు చెందిన సీనియర్ నేతలు భూమన కరుణాకర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, గొల్ల బాబూరావు, తెల్లం బాలరాజు తదితర నాయకులంతా మంత్రివర్గ విస్తరణపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
ఉగాదికా..? ప్లీనరీ తర్వాతా?
త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపట్టబోతున్నట్లు సహచర మంత్రులకు సంకేతాలిచ్చిన సీఎం వీలైనంత త్వరలోనే మార్పులుంటాయని స్పష్టం చేశారు. అయితే తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని ఉగాది రోజు మంత్రివర్గ విస్తరణ చేపడుతారా, జూన్ 7, 8 తేదీల్లో నిర్వహించే వైసీపీ ప్లీనరీ తర్వాత విస్తరణ చేపడుతారా..అనేది స్పష్టంగా తెలియనప్పటికీ వీలైనంత త్వరగా మార్పులు, చేర్పులు చేపట్టాలని, ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు.