అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో చలిపులి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ప్రజల గజ గజ వణుకుతున్నారు. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. భానుడి భగభగలతో అల్లాడే రాయలసీమ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం రికార్డ్. శ్రీ సత్యసాయి జిల్లా అగళిలో 7.6, మడకశిరలో 8.1, అనంతపురం జిల్లా బెళుగుప్పలో8.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ తెలిపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లెలో 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇంత తక్కువ ఉష్ణోగ్రత నమోదవ్వడం ఇది మూడోసారి. ఈనెల 8వ తేదీన 1.5, 9వ తేదీన 2 డిగ్రీల సెల్సియస్ నమోదవ్వగా మంగళవారం 3 డిగ్రీలు నమోదైంది.
2014 నుంచి పరిశీలి స్తే డిసెంబర్, జనవరి నెలల్లో చింతపల్లి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి. 3 డిగ్రీల సెల్సియస్ కనిష్టంగా నమోదు కాగా ఈ ఏడాది 1.5కు పడిపోయింది. 1998,1999, 2003,2012 సంవత్సరాల్లో కనిష్టంగా 1 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదు కాగా 2008, 2018లో 1.5 డిగ్రీలు కనిష్టంగా నమోదైంది. మళ్లిd ఈ ఏడాది జనవరిలో 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలను పొగమంచు కప్పేస్తోంది. రాయలసీమ ప్రాంతంలో వాయువ్యపొడిగాను, తక్కువ స్థాయిలో చల్లటి గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుతున్నాయని ఐఎండీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈనెల 12వ తేదీ వరకు చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుందని సూచిస్తున్నారు.
రానున్న రెండు మూడు రోజులు పరిస్థితి ఈ విధంగానే ఉంటుందని హెచ్చరించారు. దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు సక్రమంగా కనిపించక ప్రయాణాలు ఇబ్బందిగా మారాయి. ఉదయం 9 గంటల వరకు హెడ్‌లైట్ల వెలుతురులో వాహనాలు నడపాల్సి వస్తోంది. చలితీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువ ఉండటంతో చలిమంటలతో ప్రజలు సేదతీరుతున్నారు. చలి తీవ్రత కారణంగా సీజనల్ వ్యాధులు ప్ర బలుతున్నాయి.